సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా కేంద్రమైన కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్‌లో సుబ్రమణ్యం క్రాప్ట్ టీచర్. విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. మానవ హక్కుల వేదిక పోరాటం ఫలితంగా విచారణ చేపట్టారు. ఆరోపణలు వాస్తవమే.. చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు విద్యాశాఖ సిఫారసు చేసింది. ఇంక్రిమెంటు మాత్రమే కట్ చేశారు. ప్రస్తుతం సుబ్రమణ్యం అదే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన ఓ యూనియన్‌కు నాయకుడు కూడా..
నాగేశ్వరనాయక్.. పుల్లంపేట మండలం వత్తలూరులో టీచర్. ఓ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. విషయం తెలిసి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.. పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెండ్ కూడా అయ్యారు. ప్రస్తుతం మళ్లీ పనిచేస్తున్నారు.
వనిపెంటలో రెడ్డయ్యనాయుడు టీచర్. విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండటంతో గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్‌లో రాచమర్యాదలు పొందారు. కొన్నాళ్లు సస్పెండ్ అయి మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నారు.
బాల ఓబయ్య.. పోరుమామిళ్ల ఉర్దూహైస్కూల్‌లో హెడ్‌మాస్టర్. తొమ్మిదోతరగతి విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ప్రజా సంఘాలు, పత్రికలు ఈ విషయమై నినదించాయి. విద్యాశాఖను దుమ్మెత్తి పోశాయి. ఆరు నెలలపాటు సస్పెండ్‌కు గురయ్యాడు. కౌన్సెలింగ్‌లో అదే పాఠశాలకు పోస్టింగ్ ఇచ్చారు.
జిల్లాలో ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నా నియంత్రించడంలో విద్యాశాఖ విఫలమవుతోంది. ఇటువంటి సంఘటనలతో సమాజంలో గురువులకు తలవంపులు తెస్తున్నారు. ఇటువంటివారిపట్ల కఠినంగా వ్యవహరించకపోవడం విద్యాశాఖ ప్రథమ తప్పుగా పలువురు భావిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల ప్రలోభాలకు లొంగిపోయి తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతునే ఉన్నాయి. ప్రైవేటు కళాశాల కరెస్పాండెంట్ పద్మనాభరెడ్డి మొదలు, హెడ్‌మాస్టర్ బాలఓబయ్య, జంక్షన్ నాయక్, రెడ్డెప్పనాయుడు, నాగేశ్వరరావునాయక్, సుబ్రమణ్యం, బోయనపల్లె ఉపాధ్యాయుడు ఆర్థర్ వరకు లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు పునరావృతం అవుతునే ఉన్నాయి.
గౌరవం కోల్పోతున్న గురువులు ....
ఆచార్య దేవోభవా! అనే పదానికి కాలదోషం పడుతోంది. తల్లి, తండ్రితర్వాత స్థానంలో ఉపాధ్యాయులను చూడాలన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. గురువుల చూపుల్లోని తేడాలు పసిబుగ్గలపై పురుగుల్లా పారాడుతున్నాయి. ఉపాధ్యాయ సహచరులు సైతం తమకెందుకులే అన్న భావనతో ఉండడం వల్ల మళ్లీ మళ్లీ ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి. అభం శుభం తెలియని విద్యార్థినుల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్న గురువులపై క్రిమినల్ కేసులతోపాటు, నిర్భయ చట్టం అమల్లోకి తెచ్చి, ఉద్యోగం కోల్పొయేలా చర్యలుంటే తప్ప ఇలాంటి ఘటనలను నియంత్రించే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో వ్యక్తిగత ప్రవర్తనతోపాటు కుటుంబ చరిత్రను పరిగణలోకి తీసుకునే నిబంధన ఉంది.
ఆ విధంగా ఉపాధ్యాయుడిని కూడా కుటుంబ నేపధ్యాన్ని వ్యక్తిగత ప్రవర్తనపై విచారించి నియమించుకోవాలనే నిబంధన ఉంది. అయితే మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)లో పాసైతే ఉద్యోగం రెడీ అవుతోంది. నైతిక ప్రవర్తన మీద ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం లేదు. ఫలితంగా ఒకరి తర్వాత మరొకరు వక్రబుద్ధి గురువుల జాబితాలో చేరుతున్నారు.
ఢిల్లీ నిర్భయ తరహాలో ఉద్యమిస్తేనే....
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత చదువు చదువుతున్న విద్యార్థిని నిర్భయ అత్యాచారం పట్ల ఉద్యమించినట్లుగా ప్రజానీకం చైతన్యవంతులయ్యేంత వరకు ఉపాధ్యాయుల నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం.
తమ చిన్నారి లైంగిక వేధింపులకు గురైందని తెలిసినా సమాజానికి బయపడి తల్లిదండ్రులే ఆ ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అత్యాచార ఘటనలను తీవ్రంగా తప్పుబట్టాల్సిన పై అధికారులు తేలికగా పరిగణిస్తున్నారు. దీంతోనే రాజంపేట ఎంఈఓ కృష్ణకుమార్‌ను గ్రామస్తులు చితకబాదారు. విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడే గురువులపై నిర్భయ చట్టం అమలు చేయాలని ఈ సందర్భంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కాటేస్తున్న...
Published Sun, Jul 20 2014 2:52 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement