తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో జిల్లాలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. కేంద్ర వైఖరిని నిరసిస్తూ విద్యార్ధి, ఉద్యోగ జేఏసీ నాయకులు రోడ్డెక్కారు. రెండు నెలలుగా మొక్కవోని దీక్షతో సమైక్య పోరాటం సాగిస్తున్నా కేంద్రం లేక్క చేయకపోవడం పై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా మూడు రోజులు బంద్ చేపట్టనున్నారు.
సాక్షి, కడప: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం గురువారం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించగానే కడ ప ఏడురోడ్ల కూడలిలో ఉద్యమకారులు దిష్టిబొమ్మలు, టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు.
ఆల్‌మెవా అధ్యక్షుడు డాక్టర్ ఫరూఖ్ ఆధ్వర్యంలో భారీగా టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణతో పాటు మరో 50మంది జేఏసీ నేతలు పుట్టపర్తి సర్కిల్‌లో గురువారం రాత్రి రోడ్డుపైనే నిద్రపోయారు. కేంద్ర ప్రభుత్వం తమను రోడ్డుపైన పడేసిందని నిరసన ద్వారా తెలిపారు. స్వర్ణముఖి ట్రావెల్స్‌కు చెందిన ఓ ప్రైవేటు బస్సు అద్దాలను ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బద్వేలులో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఉపాధ్యాయులు భజన చేస్తూ నిరసన తెలిపారు.
రైల్వేకోడూరులో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజంపేట నాలుగురోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. నిరసన ర్యాలీ చేపట్టారు. ఏపీ ఎన్జీవో నేతలు, విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణనోట్ పేరుతో ప్రతులను కాల్చివేశారు. కేంద్రం ప్రకటించిన నిర్ణయంపై జిల్లావాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం:
కేబినెట్ నోట్ ఆమోదం పొందిన క్రమంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను అప్రమత్తం చేశారు. కడప నగరంతో పాటు అన్ని పట్టణ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం సాయంత్రం డీజీపీ ప్రసాదరావు, జిల్లా ఎస్పీ మనీశ్‌కుమార్‌తో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి అప్రత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో మూడురోజులు, ఏపీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో 48 గంటలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు.
రెడ్ అలర్ట్
కడప అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు సంబంధించిన తెలంగాణ నోట్ కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ప్రసాద్‌రావు నుంచి జిల్లా ఎస్పీకి ఆదేశాలు అందాయి. జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హాతో కూడా డీజీపీ నేరుగా ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచే జిల్లాలోని అన్ని కూడళ్లలో ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు ఆయా పోలీసు స్టేషన్ల అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేటి నుంచి 72 గంటల బంద్
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కేంద్ర కేబినెట్‌లో తెలంగాణా నోట్‌కు ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో 72 గంటల బంద్ చేపట్టనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణా నోట్ తయారు కాలేదంటూ ప్రకటనలు చేస్తూ ఒక్కసారిగా కేబినెట్‌లో టీ నోట్ ప్రవేశ పెట్టడం ద్వారా కేంద్రం దొంగ దెబ్బ తీసిందన్నారు. జిల్లాలోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, కార్మికులు ఈ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
టీ మంటలు
Published Fri, Oct 4 2013 2:39 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement