మున్సిపాలిటీలలో ప్రతిరోజూ తాగునీరు | In the municipality of drinking water daily | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలలో ప్రతిరోజూ తాగునీరు

Published Fri, Mar 13 2015 2:32 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM

In the municipality of drinking water daily

కడప కార్పొరేషన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ప్రతిరోజూ తాగునీరందించేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణ గౌడ్ ఆదేశించారు. కడప నగరపాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలం సమీపించనున్న నేపథ్యంలో తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఇప్పటి వరకూ మొదలుకాని పనులను రద్దు చేసి,త్రాగునీటికి ఖర్చు చేయాలని సూచించారు. నీటిఎద్దడి సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆస్తిపన్ను వసూలు, ఆధార్ సీడింగ్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
 
  ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీల వారీగా తాగునీటికి సంబంధించిన పనులు, సమస్యలపై సమీక్ష చేశారు. కడప కార్పొరేషన్ ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లికార్జున రావు మాట్లాడుతూ ఇటీవలే అలగనూరు నుంచి పెన్నానదికి నీరు వదిలారని, రెండురోజుల్లో ఆ నీరు చేరే అవకాశముందన్నారు. పెన్నాలో నీరుంటే బోర్లన్నీ చార్జ్ అవుతాయని చెప్పారు. ప్రొద్దుటూరులో తాగునీటికి సమస్య రాకుండా మైలవరం నుంచి నీరు విడుదల చేయించామని పబ్లిక్ హెల్త్ ఈఈ నగేష్‌బాబు తెలిపారు. రాజంపేటలో తాగునీటి సమస్య లేదని కమిషనర్ ఫజులుల్లా చెప్పారు.
 
  రాయచోటిలో విద్యుత్ సమస్య ఉందని, కొన్ని చోట్ల పైపులైన్లకు ఇంటర్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, కొత్తగా పైపులైన్లు వేయాల్సి ఉందని ఆ మున్సిపాలిటీ ఇంజినీర్ తెలిపారు. బద్వేలులో గతం కంటే పరిస్థితి మెరుగైందని, ఇప్పుడు రెండు రోజులకొకసారి ఇస్తున్నట్లు పబ్లిక్‌హెల్త్ ఈఈ చెప్పారు. మైదుకూరు పరిధిలో ఎర్రచెరువుకు ఎస్‌ఆర్-2 నుంచి నీటిని విడుదల చేయిస్తే సమస్య తీరుతుందని చెప్పారు. ఎర్రగుంట్లలో లీకేజీలను అరికట్టాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కడప కమిషనర్ చల్లా ఓబులేసు, ఇతర మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజినీర్లు ఆర్‌కే శ్రీనివాసులు, వేణుగోపాల్, ఎంహెచ్‌ఓ డాక్టర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement