యలమంచిలి (విశాఖ జిల్లా) : శుభకార్యానికి బయలుదేరిన కాకినాడకు చెందిన వృద్ధ దంపతులు యలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాకినాడ నుంచి గాజువాక వెళ్తున్న వీరి కారు రేగుపాలెం ఫ్లైవోవర్ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుటుంబ యజమాని ఆచంట దక్షిణామూర్తి (79), భార్య అనసూయ (68) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న దక్షిణామూర్తి రెండో కుమారుడు శ్రీనివాస్, ఆయన తనయుడు అనిల్ గాయాలతో బయటపడ్డారు. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వీరిని మృత్యువు లారీ రూపంలో కబళించడంతో విషాదం అలుముకుంది.
మూడో కుమారుడి ఇంటికెళ్తూ...
కాకినాడ భానుగుడి జంక్షన్ సమీపంలో శ్రీరామ్‌నగర్ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఎంఎస్ రెసిడెన్సీలో ఉంటున్న దక్షిణామూర్తి, భార్య అనసూయ దంపతులు ఉంటున్నారు. వారి రెండో కుమారుడు శ్రీనివాస్, మనుమడు అనిల్‌లతో కలిసి గాజువాకలో ఉంటున్న మూడో కుమారుడు వీరరాజశేఖర్ ఇంటికి శనివారం ఉదయం 6 గంటలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు రేగుపాలెం ఫ్లైఓవర్ దాటిన తర్వాత రోడ్డు పక్కగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
అతివేగమే కారణమా..
ప్రమాదం జరిగిన ప్రాంతంలో మలుపు ఉండటం, వాహనం వేగంగా ప్రయాణించడంతో అదుపు చేయడానికి సాధ్యపడలేదు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే దక్షిణామూర్తి, భార్య అనసూయ కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జయింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్సై సీహెచ్.వెంకట్రావు, హైవే పెట్రోలింగ్ ఎస్సై దయానిధి సిబ్బందితో ప్రమాదస్థలానికి చేరుకున్నారు. గాయపడిన తండ్రీ కొడుకులు శ్రీనివాస్, అనిల్‌లను యలమంచిలి ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం బంధువులు కాకినాడకు తరలించారు. మృతదేహాలను యలమంచిలి మార్చురీకి తరలించారు. మృతదేహాలపై ఉన్న బంగారు ఆభరణాలను యలమంచిలి రూరల్ ఎస్సై వెంకట్రావు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆనందంగా బయలుదేరి..
దక్షిణామూర్తి మూడో కుమారుడు వీరరాజశేఖర్ అనకాపల్లి టెలికాం డిపార్ట్‌మెంట్‌లో జేటీఓగా పనిచేస్తున్నారు. ఇటీవల ఇతను గాజువాకలో కొత్తగా ఇంటిని నిర్మించారు. సోమవారం గృహప్రవేశం చేయడానికి నిర్ణయించారు. దీని కోసం దక్షిణామూర్తి దంపతులు ఆనందంగా కుమారుడి ఇంటికి వస్తుండగా ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మార్చురీ వద్ద మిన్నంటిన రోదనలు..
మృతి చెందిన దక్షిణామూర్తి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాధాకృష్ణ శర్మ కాకినాడలోని విద్యాశాఖలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు శ్రీనివాస్ ప్రమాదంలో గాయపడ్డారు. మూడో కుమారుడు వీరరాజశేఖర్. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో యలమంచిలి మార్చురీ వద్దకు చేరుకున్నారు. దంపతులిద్దరి మృతదేహాలను చూసి బోరున విలపించారు. మార్చురీ వద్ద రోదనలు మిన్నంటాయి.
గృహ ప్రవేశానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
Published Sun, Apr 10 2016 1:52 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement