ప్రసాదిత్య సంస్థ నిర్మించనున్న మల్టిప్లెక్స్, షాపింగ్ మాల్ నమూనా చిత్రం
సాక్షి, రాజమహేంద్రవరం: రాజకీయ, ఆర్థిక బలాన్ని బట్టి ప్రభుత్వ శాఖల్లో పనులు జరుగుతాయన్నది కాదనలేని నిజం. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అన్నది జగమెరిగిన సత్యం. ఇందుకు రాజమహేంద్రవరం నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్ ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది. సామాన్యులు చిన్నపాటి ఇళ్లు నిర్మించుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు, ప్లాన్లు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్‌వోసీ (అభ్యంతరలేమీ పత్రం)లు.. ఇలా సవాలక్ష ఆంక్షలు, ఆపసోపాలు పడాల్సి ఉంటుంది. అలాంటిది రాజమహేంద్రవరం నగరంలోనే అతి పెద్ద నిర్మాణంగా నిలవనున్న ప్రసాదిత్య మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్‌కు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం జరిగిపోతోంది. అనుతులు లేకుండా, అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా తెరవెనుక మంత్రాంగం నడిపిన శక్తి ఎవరన్న విషయంపై నగరంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎంపీ మురళీమోహన్‌కు ఈ మల్టిప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లో వాటా ఉంది కాబట్టే అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, కనీస ప్రమాణాలు పాటించకుండా పనులు చేయగలుగుతున్నారని తెలిసింది. ఘటన జరిగిన సమయంలోనూ, అంతకుముందు జరిగిన పరిణామాలు ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి.
శంకుస్థాపనకు హాజరైన ఎంపీ..
ప్రసాదిత్య సంస్థ గత ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. సంస్థ చైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి. ప్రసాద్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్‌తోపాటు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్ పంతం రజనీశేష సాయి, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీమోహన్ నిర్మాణం, నగర అభివృద్ధిపై ప్రసంగించారు కూడా.
అన్నీ తానై నడిపిన వైనం...
మల్టిప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వ విభాగాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఎంపీ మురళీమోహన్ తీసుకున్నారని ఆరోపణలు తాజా ఘటన తర్వాత వెల్లువెత్తుతున్నాయి. 2016లో అర్బన్ జిల్లా ఎస్పీగా ఉన్న హరికృష్ణ నుంచి ఎన్‌వోసీ తీసుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ తన అనుచరులను పంపి ఈ పనులు చేయించారని సమాచారం. మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్‌కు నగరపాలక సంస్థ పూర్వపు కమిషనర్ వి.విజయరామరాజుపై ఒత్తిడి తెచ్చి మౌఖిక ఆదేశాలు జారీ చేయించారని తెలుస్తోంది. తమకు రాతపూర్వక అనుమతులు ఇంకా రాలేదని, కమిషనర్ అనుమతులు ఇచ్చారంటూ ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో నిర్మాణ సంస్థ అధికారులు చెప్పడం గమనార్హం. గుడా పరిధిలో మొదటిసారిగా భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్నా అధికారులు కానీ, నగరపాలక సంస్థ యంత్రాంగం కానీ ఆ వైపు వెళ్లకుండా చేయడం వెనుక ప్రజాప్రతినిధులు ఒత్తిడి ఉందనడంలో సదేహం లేదని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇంటికి వెళ్లే దారిలోనే కనీస ప్రమాణాలు పాటించకుండా అంచుల వరకు తవ్వినా అధికారులు దృష్టికి రాకుండా ఉండదు. పైగా నగర ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే దారి వినాయక చవితి రోజున గోతుల వైపు వాలిపోయింది. మట్టి జారిపోకుండా తాత్కాలికంగా రక్షణ చర్యలు చేపట్టారు.
ఘటన తర్వాత అనుక్షణం అప్రమత్తం..
ఘటన జరిగిన తర్వాత ఎంపీ మురళీమోహన్ అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో హుటాహుటిన ఎంపీ అనుచరులు, కార్యాలయ సిబ్బంది ఆయన కారులోనే వచ్చారు. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. రాత్రి 8 గంటల వరకు నగరంలో ఉన్న ఎంపీ మురళీమోహన్ అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్లిపోయారని సమాచారం. ఘటనా స్థలానికి వచ్చిన సబ్ కలెక్టర్, కమిషనర్, డీఎస్పీ, నగరపాలక సంస్థ అధికారులతో నేరుగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకున్నారు. తర్వాత ఏమి చేయాలన్నదానిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎంపీ అనుచరుల హల్‌చల్..
శనివారం రాత్రి ఘటన జరిగిన సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీ అనుచరులు హల్‌చల్ చేశారు. ఫోటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. లోపలకి వెళ్లేందుకు అనుమతిలేదంటూ హడావుడి చేశారు. అధికారులతో మాట్లాడుతూ అంతా తామై నడిపారు. రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలానికి వచ్చిన స్థానిక టీడీపీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియపై కూడా జులుం ప్రదర్శించారు.
తూతూ మంత్రంగా చర్యలు...
అనధికారికంగా గోతులు తీసి, చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు నష్టం కలిగించినా కూడా సదరు నిర్మాణదారులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్మాణం ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు మాత్రం జారీ చేశారు. రాజకీయ అండలేని ఓ సామాన్యుడైతే పరిస్థితి మరోలా ఉండేదని నగర ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment