తిరుపతి : ఓ హత్యకేసులో సాక్షిగా వున్న యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం జరిగింది. అలిపిరి ఎస్‌ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలలో టోపీల వ్యాపారం చేస్తున్న దిలీప్ కుమార్ (24) గత సంవత్సరం జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన సాక్షిగా వున్నాడు. కాగా ఆ కేసులో ముద్దాయిగా వున్న డిమ్ అండ్ డిప్ శివ గతవారం దిలీప్‌కుమార్ను పిలిచి కేసు సాక్ష్యం విషయంలో రాజీ పడాలని కోరాడు. అందుకు దిలీప్‌కుమార్ నిరాకరించడంతో నీ అంతు చూస్తానంటూ బెదిరించి వదిలేశాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం దిలీప్‌కుమార్ బిటిఆర్‌పురంలోని కార్ సర్వీసింగ్ సెంటర్ వద్దకు వెళ్ళాడు. అప్పటికే అక్కడ కారులో(ఎపి220116) వేచి ఉన్న శివ.. అనుచరులతో దిగాడు. మొత్తం ఏడుగురు కలసి ఒక్కసారిగా దిలీప్‌కుమార్‌ను హతమార్చేందుకు కత్తులతో దాడిచేశారు. దీంతో దిలీప్‌కు కాలు, చెయ్యిపై కత్తిపోట్లు పడ్డాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో దిలీప్ పరుగెత్తుతూ అదే కాలనీలోని ఓ ఇంటిలోకి వెళ్లి తలుపులు మూసేశాడు. శివ గ్యాంగ్ తలుపులను పగులకొట్టడానికి ప్రయత్నించగా చుట్టుపక్కలవారందరూ రావడంతో నిందితులు పరారయ్యారు. త్రీవంగా రక్తస్రావమవుతున్న దిలీప్‌కుమార్‌ను స్థానికులు రుయా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం దిలీప్‌కుమార్ ఆరోగ్యం బాగానే వుంది. పోలీసులు అతన్ని విచారించగా అతనిపై దాడిచేసినవారు డిమ్‌అండ్‌డిప్ శివ, మణి, గణేష్, అభిషేక్, మధు, చాను, దుర్గ వీరితో పాటు మరికొందరు వున్నారని తెలిపాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కేసులో ప్రధాన సాక్షిపై హత్యాయత్నం
Published Fri, May 22 2015 8:30 PM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
Advertisement
Advertisement