వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం
కదిరిరూరల్ : ముదిగుబ్బ మండలం మొలకవేమల సర్పంచ్ రమణమ్మ భర్త, వైఎస్సార్ సీపీ నేత వెంకటరమణపై గురువారం నాగారెడ్డిపల్లి బ్రిడ్జి దగ్గర హత్యాయత్నం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. వెంకటరమణ తన గ్రామానికి చెందిన చంద్రమోహన్‌రెడ్డితో కలిసి ఓ కేసు విషయమై కదిరి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు పని ముగిసిన అనంతరం ఇద్దరు ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలు దేరారు.
నాగారెడ్డిపల్లి బ్రిడ్జి దగ్గరకు రాగానే వెనుక నుంచి సుమో వాహనంలో వచ్చిన ప్రత్యర్థులు వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొని వేగంగా ముందుకు వెళ్లిపోయూరు. ఈ ఘటనలో వెంకటరమణకు చేతులు, తల, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. చంద్రమోహన్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే..
తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే టీడీపీ నేత దేవేంద్ర, అతని అనుచరులే తనను హతమార్చాలని ప్రయత్నించినట్లు వెంకటరమణ ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో తాము వైఎస్సార్ సీపీ విజయం కోసం పనిచేశామని, ఇది జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఈ ఘాతుకానికి పూనుకున్నారని తెలిపారు.