రూ.500 కోసం హత్య
రూ.500 కోసం హత్య
నిర్మల్ టౌన్, : రూ.500.. ఓ వృద్ధురాలి తీసేలా చేసింది. మహిళను కటకటాల్లోకి నెట్టింది. అవసరానికి డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో వృద్ధురాలిని అతి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
నిర్మల్ మండలం వెంగ్వాపేట గ్రామంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 23 రోజుల్లో ఛేదించారు. నిందితురాలిని అరెస్టు చేశారు. నిర్మల్ డీఎస్పీ ఎస్వీ.మాధవరెడ్డి, రూరల్ సీఐ ఎ.రఘు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. వెంగ్వాపేట గ్రామంలో ఉడుత భూమవ్వ(60) ఒంటరిగా జీవిస్తుండేది. ఆమె తో ఉన్న పరిచయం కారణంగా నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన ఎన్.జుమున అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేది. జమున కూడా ఆదర్శనగర్‌లో ఒంటరిగానే ఉంటోంది.
గత నెల 26న భూమవ్వ ఇంటికి వెళ్లింది. తనకు రూ.500 అవసరం ఉన్నాయని, ఇవ్వాలని కోరింది. తన వద్ద డబ్బులు లేవని, తిని వెళ్లూ అంటూ భూమవ్వ చెప్పింది. దీంతో ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి విందు చేసుకున్నారు. మద్యం సేవించారు. భూమవ్వ వద్ద రూ.500 ఉండడాన్ని గమనించిన జమున ఆమెను చంపి డబ్బులు తీసుకెళ్లాలని భావించింది. మద్యం మత్తులో ఉన్న భూమవ్వపై జమున బరిశె, కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చింది. డబ్బులు తీసుకుని పారిపోయింది. విచారణ చేపట్టిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసును ఛేదించారు. మంగళవారం జమునను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న కె.చిన్నయ్య, ఎస్.భోజాగౌడ్‌లను డీఎస్పీ, సీఐ అభినందించారు.