హత్యకేసులో ‘వసంత’ తనయుడి అరెస్టు
నందిగామ, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుడు పొదిల రవి హత్య కేసులో కుట్రదారునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్‌ను శుక్రవారం వేకువజామున పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణప్రసాద్, పొదిల రవి కుటుంబాల మధ్య ఆస్తులకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. వసంత నాగేశ్వరరావు మేనల్లుడు మద్దాలి హనుమంతరావు (చిన్నపుల్లయ్య) రెండేళ్ల కిందట హత్యకు గురయ్యాడు.
ఈ ఘటనపై పుల్లయ్య భార్య, బావమరిది రవి, మరికొందరిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రవిని 2013 జూన్ 12న కోనాయపాలెం వద్ద కొందరు హత్య చేశారు. ఈ ఘటనపై చందర్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవగా, ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ హత్యకు కృష్ణప్రసాద్ సూత్రధారి అని కేసులో ఒకటి, రెండు నిందితులుగా ఉన్న సాంబ, మంగలి బాబు విచారణ సందర్భంగా చెప్పారు. తన భర్త హత్యకు కృష్ణప్రసాద్ కారణమని పేర్కొంటూ పొదిల రవి భార్య మాధవి రెండు నెలల కిందట జిల్లా ఎస్పీకి అర్జీ అందజేసింది. దీనిపై జగ్గయ్యపేట మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం కూడా ఇచ్చింది. ఎస్పీ ఆదేశాల మేరకు దీనిపై నందిగామ డీఎస్పీ విచారణ జరిపారు. ఆయన ఆదేశాల మేరకు నందిగామ రూరల్ సీఐ రామ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం కృష్ణప్రసాద్‌ను అరెస్టు చేశారు. అనంతరం నందిగామ కోర్టులో హాజరుపరిచారు.
టీడీపీ నేతల ధర్నా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగంగానే వసంత కృష్ణప్రసాద్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేశారని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తంగిరాల ప్రభాకరరావు, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపించారు. ఈ సంఘటనను నిరసిస్తూ వారు ధర్నా చేశారు.
వైఎస్సార్ సీపీకి వసంత రాజీనామా
తన కుమారుడి అరెస్టుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపిస్తూ మాజీ మంత్రి, పార్టీ నాయకుడు వసంత నాగేశ్వరరావు శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.