కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖనిలో ఆదివారం ఉదయం అదృశ్యమైన తోట వంశీ(19) అనే యువకుడు, మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్‌లో రైల్వేట్రాక్‌పై సోమవారం శవమై కనిపించాడు. తల, మొండెం వేరయ్యాయి. తల్లిందండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పథకం ప్రకారం ఎవరైనా హత్య చేశారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనేది మిస్టరీగా మారింది.
మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోదావరిఖని సీతానగర్‌లో తోట సత్యనారాయణ-పుష్ప దంపతులకు శ్రావణ్‌కుమార్, సాయికుమార్, వంశీ ముగ్గురు సంతానం. సత్యనారాయణ ఆటోరిక్షా డ్రైవర్. పుష్ప కూరగాయల మార్కెట్‌లో కూలీ. పదో తరగతి వరకు చదివిన చిన్న కొడుకు వంశీ(19) లారీపై పని చేస్తున్నాడు.
ప్రేమ వ్యవహారంలో గొడవలు..
తన కాలనీలోని ఓ యువతిని వంశీ ప్రేమించాడనే విషయంలో కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి గతంలో కోర్టు వరకు వెళ్లాయి. కొంతకాలం తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. యువతి చైన్‌ను వంశీ తీసుకున్నాడని వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ మేరకు సోమవారం పంచాయితీ చేయడానికి పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వంశీ ఆచూకీ లభించలేదు.
సిమ్ ఆధారంగా సమాచారం..
బల్లార్ష రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లాట్‌ఫాం చివరన రైలు పట్టాలపై వంశీ మృతదేహం ఉందని రైల్వే పోలీసులు సోమవారం సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. మృతదేహం వద్ద మూడు రైల్వే టిక్కెట్లు, సెల్‌ఫోన్ సిమ్ లభించాయి. సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మూడు రైల్వే టిక్కెట్లలో రెండు టిక్కెట్లు రామగుండం నుంచి బల్లార్ష వరకు, ఒక టిక్కెట్ కాగజ్‌నగర్ నుంచి బల్లార్ష వరకు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం రాత్రి సుమారు 10.30 గంటల ప్రాతంలో గోదావరిఖనికి చెందిన ఓ యువకుడికి బల్లార్షలో కనిపించినట్లు తెలిసింది. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బల్లార్ష ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని గోదావరిఖనికి తరలించారు.
హత్యా..? ఆత్మహత్యా?
Published Tue, Jan 28 2014 4:54 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement