సాక్షి, గుంటూరు: కులం, మతం అంటూ అడ్డుగోడలు ఏర్పరుచుకుంటూ జీవిస్తున్న చాలామందికి తురకపాలెం ముస్లింల్లో వెల్లివెరుస్తున్న మత సామరస్యాన్ని చూసైనా కనువిప్పు కలగాలి. గుంటూరు జిల్లాలోని మాచవరం మండలం తురకపాలెం ధ్వజస్తంభాల నిర్మాణానికి ప్రసిద్ధి. ఇక్కడ ధ్వజస్తంభాలను మలిచేవారంతా ముస్లింలే కావడం విశేషం. వందేళ్ల క్రితం నుంచి క్వారీల్లోని రాళ్లతో స్తంభాలు చెక్కడం మొదలుపెట్టారు. దేవాలయాల్లో ప్రతిష్టించి, పూజించే ధ్వజస్తంభాలను చెక్కేది ముస్లింలని తెలిసి కూడా వీరిలో నైపుణ్యాన్ని గుర్తించి హిందువులు వీరికే ఆర్డర్లు ఇస్తున్నారు. పరమత సహనానికి, మత సామరస్యానికి ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. 80 శాతం మంది ముస్లింలు ధ్వజస్తంభాలు చెక్కే వృత్తిని ఎంచుకుని జీవనం సాగిస్తున్నారు.
20 మంది గ్రూపుగా..: వంద అడుగుల నుంచి రెండు వందల అడుగుల పొడవైన ధ్వజస్తంభాలను 20 మంది గ్రూపుగా ఏర్పడి చెక్కుతుంటారు. అయితే 200 అడుగులు ఉన్న ఒకే రాయిని వెతికి పట్టడం అంత సులువైన పనేమీ కాదు. ఒక్కో ధ్వజస్తంభాన్ని చెక్కడానికి 20 మందికి నెల రోజులు పడుతుందని వారు చెబుతున్నారు. ఒక్కో స్తంభం చెక్కడానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ తీసుకుంటారు. దాన్ని దేవాలయం వరకు చేర్చే బాధ్యత వీరిదే. మధ్యలో ధ్వజస్తంభం విరిగితే మళ్లీ కొత్తదాన్ని తయారుచేసి అందిస్తారు. ఇలాంటి సందర్భాల్లో కార్మికులు నెల రోజులపాటు కూలీ లేకుండానే పనిచేస్తారు. తమను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మతం పేరుతో తన్నుకోవడం దారుణం
మతం పేరుతో కొందరు తన్నుకోవడం చూస్తుంటే బాధేస్తుంది. మేము మూడు తరాలుగా ధ్వజస్తంభాలు చెక్కుతున్నాం. హిందువులు మా వద్దకు వచ్చి ఆర్డర్లు ఇస్తుంటారు. మేము ఆంజనేయస్వామిని పూజించిన తర్వాతే ధ్వజస్తంభాలు చెక్కుతాం. మతసామరస్యానికి మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. – షేక్ మహబు, మేస్త్రీ, తురకపాలెం
అనేక ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం
ధ్వజస్తంభం చేసినందుకు రోజూ రూ.200 మాత్రమే ముడుతుంది. అయితే మేము చెక్కిన ధ్వజస్తంభాలను ప్రతిష్టించి వాటికి పూజలు చేస్తుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. మా కళను హిందువులు గౌరవిస్తుండటం మంచి పరిణామం. – షేక్ సైదా, తురకపాలెం
Comments
Please login to add a commentAdd a comment