అరెస్టయిన వారికి మద్దతుగా గుంటూరులో ర్యాలీగా వస్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ముస్తఫా, అంజాద్ బాషా, నాయకులు పార్థసారథి, అంబటి, మేరుగ, లేళ్ళ, రవిచంద్రకిషోర్ రెడ్డి, ఇక్బాల్ తదితరులు
‘అయ్యా.. మీరిచ్చిన హామీలే.. ఒక్కసారి గుర్తు చేస్తున్నాం.. నాలుగేళ్లుగా అడిగీ అడిగీ వేసారిపోయాం. పది మందిలోనైనా మీ దృష్టికి తీసుకొస్తే న్యాయం జరుగుతుందని ఆలోచించాం.. అంతకంటే వేరే ఉద్దేశమేమీ లేదు.. మేం దేశ ద్రోహులం కాదు.. తెలుగు జాతి బిడ్డలమే..’ అంటూ జైలు నుంచి విడుదలైన తొమ్మిది మంది ముస్లిం యువకులు కన్నీటి పర్యంతమయ్యారు. అన్యాయంగా తమను అరెస్టు చేసి కుళ్లబొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు లాఠీలు ఝుళిపించారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో తమ ఇళ్ల ముందుకొచ్చి మరీ హామీలు గుప్పించి ఓట్లు కోసం చేయి చాచారు.. ఈ రోజు నోరు తెరిచి అడిగితే చేతులు విరగ్గొట్టారు. ఇదేనా ప్రభుత్వ పాలనంటే..? ఇదేనా ముస్లింలపై ప్రేమంటే ? ఇదేనా మైనార్టీలకు ఇచ్చే గౌరవమంటే ? అని నిలదీశారు. ముస్లింలపై టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు రగిలిపోతున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ ఎన్నికల వాగ్దానాలన్నీ ఏమయ్యాని, శాంతియుతంగా ప్లకార్డులతో నిరసన తెలపడం వారు చేసిన నేరం..ఈ మాత్రం దానికే దేశ ద్రోహులుగా చిత్రీకరించి తొమ్మిది మంది ముస్లిం యువకులపై తప్పుడు కేసులు బనాయించారు. స్టేషన్‌లో పెట్టి మరీ హింసించారు. దీనిపై ముస్లిం వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వీరిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ కేసులు నమోదు చేయడాన్ని ముస్లింలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బతినేలా తమను దూషించారని, దివ్యాంగుడినని చెబుతున్నా కనీసం జాలి లేకుండా ఎస్సై కాలితో తన్నారని షేక్ బుబేగ్ అహ్మద్ అనే యువకుడు చెప్పిన మాటలు మైనార్టీలను కలిచి వేస్తున్నాయి. శాంతియుతంగా నిరసనకు రాజకీయ రంగు పులమటం తగదని మండిపడుతున్నారు. తమ వెనక వైఎస్సార్ సీపీ ఉండి ఇదంతా చేయించిందని ఒప్పువాలంటూ కొట్టడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దిగజారుతనానికి ఇది నిదర్శనమన్నారు.
ముస్లిం యువతకు అండగా వైఎస్సార్ సీపీ
ముస్లిం యువకులను వైఎస్సార్ సీపీ నేతలు అండగా నిలిచారు. ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డితో పలువురు నేతలు నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. జిల్లా జైలుకు వెళ్లి ముస్లిం యువతకు మనోధైర్యం చెప్పారు. కోర్టులో న్యాయవాది బ్రహ్మారెడ్డి ముస్లిం యువకుల పక్షాన వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్ వేసి శుక్రవారం బయటకి తీసుకొచ్చారు. జైలు నుంచి వచ్చిన ముస్లిం యువకులకు వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, కృష్ణా జిల్లా పరిశీలకులు ఇక్బాల్, ఎమ్మెల్యే ముస్తఫా, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నంద్యాల నాయకుడు రవిచంద్ర కిశోర్ రెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, కత్తెర హెనీక్రిస్టినా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, రాష్ట్ర కార్యదర్శులు లాలుపురం రాము, ఎండీ నసీర్ అహ్మద్ గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లాల మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ జిలాని, సయ్యద్ మాబు, గుంటూరు నగర అధ్యక్షుడు షేక్ గౌస్, జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు, పార్టీ నేతలు బొర్రా వెంకటేశ్వరరెడ్డి, మేరువ నర్సిరెడ్డి, పరసా కృష్ణారావు, పివి రమణ, ఆవుల సుందర్‌రెడ్డి, సయ్యద్ అమీర్, మార్కెట్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment