
పుంగనూరు చైర్మన్ సీటు ముస్లింలకే
- మైనారిటీలకు సముచిత స్థానం
- అందరితో చర్చించాకే అభ్యర్థుల పేర్లు
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు, న్యూస్‌లైన్: పుంగనూరు మున్సిపల్ చైర్మన్ పదవిని ముస్లిం మహిళకు కేటాయిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చైర్మన్ అభ్యర్థి, వైస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరనే విషయం ఇంకా నిర్ణయించలేదని, ఈ విషయమై అందరితో చర్చించి ప్రకటిస్తామని తెలిపారు.
ఈ విషయం తెలియడంతో నియోజకవర్గంలోని ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సమితుల ఏర్పాటునుంచి మున్సిపాలిటీగా ఏర్పాటైన తరువాత కూడా పుంగనూరులో ఎక్కువసార్లు ముస్లింలు చైర్మన్ పదవిలో కొనసాగారు. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడు కొండవీటి నాగభూషణంను మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
అప్పట్లో ముస్లిం మైనారిటీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ పెద్దిరెడ్డి మైనారిటీలకు నచ్చజెప్పారు. ఇప్పుడు కూడా కొండవీటి నాగభూషణం సతీమణి కాంతమ్మకు చైర్మన్ పదవి ఇస్తారని ఊహించారు. కానీ పెద్దిరెడ్డి మనోగతం గ్రహించిన కొండవీటి నాగభూషణం తమకు చైర్మన్ పదవి వద్దని, ముస్లిం మహిళకు ఇవ్వాలని కోరడంతో మార్గం సుగమమైంది.