నా భర్త నాకు కావాలి
అత్తవారింటి ముందు బైఠాయించిన వివాహిత
గుంటూరు రూరల్ : ఓ వివాహితను అత్తింటి వారు కొట్టి ఇంట్లో నుంచి గెంటెయ్యడంతో గత నాలుగు రోజులుగా అత్తింటి ముందు బైఠాయించి నిరసనకు దిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పొన్నూరు ప్రాంత పరిధిలోని గాజులవారి వీధికి చెందిన రాజ్యలక్ష్మికి గుంటూరు పాతగుంటూరు బాలాజీనగర్ 8వ లైన్‌కు చెందిన కేదారి సతీష్‌తో పెద్దల సమక్షంలో 2008 ఆగస్టు 24న వివాహం జరిగింది. సతీష్ అదే ప్రాంతంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహించేవాడు. రాజ్యలక్ష్మి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటుంది. వివాహానంతరం భార్య, భర్తలు సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. మూడు నెలల తరువాత భర్త సతీష్ అన్న కేదారి రమేష్ నిత్యం మద్యం తాగి తల్లిదండ్రులైన సాంబశివరావు, భిక్షావతిలను వేధిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో సతీష్ గుంటూరులోని తల్లి దండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. అప్పటినుంచి సతీష్ పాతగుంటూరులో ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటూ ఉండగా, భార్య రాజ్యలక్ష్మి హైదరాబాద్‌లోనే ఉంటోంది. భర్త సతీష్ హైదరాబాద్‌కు వచ్చి వెళుతుండేవాడు.
ఆరు నెలల క్రితం భర్తకు ఫోన్‌చేయగా, తాను ఇక హైదరాబాద్ రానని, తనకు విడాకులు కావాలని అనడంతో అవాక్కయింది. ఈ క్రమంలోనే తన భార్య కాపురానికి రావడం లేదంటూ సతీష్ కోర్టు ద్వారా నోటీసును పంపించాడు. ఈనెల 3న సతీష్ అన్న రమేష్ మద్యం బాగా తాగి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి రాజ్యలక్ష్మి హుటా హుటిన గుంటూరులో అత్తగారింటికి వచ్చేసరికి అక్కడ గుడి ఆదిలక్ష్మి అనే యువతి ఉంది. ఆమె ఎవరు అని ప్రశ్నించడంతో సతీష్ భార్య అని, రెండో వివాహం చేసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో రాజ్యలక్ష్మి పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ నెల 5న రాజ్యలక్ష్మి తిరిగి అత్తింటికి వెళ్లగా అత్త భిక్షావతి, మామ సాంబశివరావు, ఆడపడుచులైన చింతల శ్రీలత, చింతల శ్రీను ఆమెను బయటకు గెంటేశారు. దీంతో రాజ్యలక్ష్మి గత నాలుగు రోజులుగా అత్తింటి ముందే బైఠాయించి నిరసనకు దిగింది. నాలుగురోజులుగా అత్తింటి ముందు బైఠాయించిన రాజ్యలక్ష్మి విషయం తెలిసి పాతగుంటూరు సీఐ మొయిన్ సోమవారం అక్కడకు వెళ్లి రాజ్యలక్ష్మిని కలిసి మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.