
'నాలుగైదు లక్షల కోట్లు అడిగిన ఘనత బాబుది'
న్యూఢిల్లీ : ప్రజల మనోభావాలు గుర్తించకుండా నాలుగైదు లక్షల కోట్లు కావాలని అడిగిన చరిత్ర చంద్రబాబునాయుడుదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకమండలి సభ్యుడు మైసురారెడ్డి మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మైసూరారెడ్డి.... చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త రాజధాని ఏర్పాటు కోసం బాబు నాలుగైదు లక్షల కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కు తీసుకుంటే సమైక్య రాష్ట్రం సాకారమవుతుందని మైసూరా అన్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తాము పోరాడుతుంటే చంద్రబాబు ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దశాబ్దాల పాటు చెమట చుక్కలు చిందించి నిర్మించికున్న రాష్ట్రాన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘనత సోనియాదేనని మైసూరరెడ్డి విమర్శించారు.
విభజనకు ముందు వేయాల్సిన మంత్రులు కమిటీని ఇప్పుడు వేయడమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ మాత్రం కృషి చేయని టీడీపీ.... కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసేందుకు మాత్రం ముందుంటోందని మైసూరారెడ్డి విమర్శించారు.