ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆయుష్షు మూడేళ్లలో ముగియనుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి చెప్పారు.
- టీడీపీ అవినీతిపై పోరాటం ఉధృతం
- ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి
విజయవాడ సెంట్రల్ (కృష్ణా జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆయుష్షు మూడేళ్లలో ముగియనుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఆంధ్రరత్న భవన్‌లో జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2050 వరకు టీడీపీ అధికారంలో ఉంటుందని చంద్రబాబు కలలు కంటున్నారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. అవినీతి సంపాదన మితిమీరడంతో చంద్రబాబు అహంకారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అడవి పందులతో పోల్చిన బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో హామీలను గాలికి వదిలేశారన్నారు.
దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ గుర్తింపును రద్దుచేయాలని కోరతామన్నారు. చంద్రబాబు నుంచి జన్మభూమి కమిటీల వరకు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. దీనిపై కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేయనున్నట్లు తెలిపారు. త్వరలో రాహుల్‌గాంధీ విశాఖ మన్యంలో భరోసాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తిరువనక్కరసు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కోపంగా ఉన్న ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకుంటున్నారన్నారు.
నియోజకవర్గాలవారీగా పునశ్చరణ తరగతులు నిర్వహించాలని, ప్రభుత్వ పథకాలు అందని అర్హుల తరఫున పోరాటం చేయాలని, తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని, ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకు ఇతరపార్టీల మద్దతు కూడగట్టాలని సమన్వయ కమిటీ తీర్మానించింది. మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు.