ప్రత్యేక హోదాపై పీసీసీ చీఫ్ రఘువీరా
న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్‌తో బీజేపీ, టీడీపీ నిజాయితీ ఏంటో బయటపడుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇతర పార్టీలను కోరినట్టు వివరించారు. ఓటింగ్ జరిగే 13వ తేదీన కాంగ్రెస్ సభ్యులందరూ హాజరవ్వాలని పార్టీ విప్ జారీచేస్తుందని, దీనిపై ఇప్పటికే సోనియాగాంధీ ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు.
ప్రైవేటు బిల్లు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకోవాలని బీజేపీ, టీడీపీ కుట్రలు పన్నుతున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆర్థిక బిల్లుపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి రాజధాని లేదని, నిర్మాణంలో తగిన సాయం చేయాలని ఆయన కోరారు.