ఓపీ స్లిప్పే డిశ్చార్జ్ సమ్మరీనానని హౌస్‌సర్జన్‌ను ప్రశ్నిస్తున్న డాక్టర్ దీపాలి మన్కర్
అనంతపురం న్యూసిటీ: ‘ఓపీ స్లిప్పే.. డిశ్చార్జ్ సమ్మరీనా? అన్ని విభాగాల్లో ఈ స్లిప్పులతోనే సరిపెడుతున్నారా. డిశ్చార్జ్ సమ్మరీను ఇలాగేనా ఉంచేది? రోగులు ఫాలో అప్ ట్రీట్‌మెంట్‌కు వచ్చినప్పుడు వైద్యులు ఏ విధంగా చికిత్స చేస్తారు. ఇది సరైన పద్ధతికాదు.’ అంటూ నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటర్, హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ సభ్యురాలు(ఎన్‌ఏబీహెచ్) న్యూఢిల్లీ సెక్రటేరియట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దీపాలీ మన్కర్ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. గురువారం అసిస్టెంట్ డైరెక్టర్ సర్వజనాస్పత్రిలోని మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలు, సురక్షిత ప్రమాణా లపై ఆరా తీశారు. మొదట
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఆర్ ఎంఓ డాక్టర్ లలిత, అసిస్టెంట్ ఆర్‌ఎంఓ డాక్టర్ జమాల్‌బాషా, మేనేజర్ శ్వేతతో సమావేశమై రికార్డులను పరిశీలించారు. అనంతరం చిన్నపిల్లల వార్డు, సర్జికల్ వార్డు, అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్(ఏఎంసీ), మెయిన్ ఆపరేషన్ థియేటర్, ఈఎన్‌టీ ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. సర్జికల్ వార్డులో..డిశ్చార్జ్ సమ్మరీ ఎందుకు నిర్వహించడం లేదని హౌస్‌సర్జన్, స్టాఫ్‌నర్సును ప్రశ్నిస్తే ఇండెంట్ పెట్టినా స్టోర్స్ వాళ్లు పంపిణీ చేయలేదన్నారు. కేసు షీట్‌లో వైద్యుల సంతకాలు లేవని, అలాగే రోగులకందించే మాత్రలు రోజుకు ఏ విధంగా వాడాలో పొందుపర్చేలా చూసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆమె సూచించారు. ఏఎంసీను ఐసీయూ తరహాలోనే చూడాలన్నారు.
సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోం
ఎన్‌ఏబీహెచ్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యానికి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దీపాలీ మన్కర్ సూచించారు. ఎన్‌ఏబీహెచ్ నిబంధనల ప్రకారం 10 చాప్టర్లకు సంబంధించి వైద్యులు, సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాలన్నారు. సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎన్‌ఏబీహెచ్ బృందం మరోసారి తనిఖీ చేస్తుందన్నారు. 500 పడకలకు సంబంధించి నాణ్యత, సురక్షిత ప్రమాణాలు, మౌళిక సదుపాయాలు, రికార్డు నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు.
సినీ ఫక్కిలో సిబ్బంది
ఎన్‌ఏబీహెచ్ బృందం వస్తుందని ఆస్పత్రి యాజమాన్యం కొత్త అవతారానికి శ్రీకారం చుట్టింది. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో వైద్యులు, సిబ్బంది అప్రాన్, మాస్క్ ధరించి ప్రత్యేకంగా కన్పించారు. ఆస్పత్రికి వచ్చిన వారు ఇది అనంతపురం ఆస్పత్రేనా? లేక కార్పొరేట్ సెక్టార్‌లో ఉన్నామా అనే తరహాలో కన్పించారు. అచ్చం శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా తరహాలో డూప్ ఆస్పత్రిని ఏవిధంగా ఏర్పాటు చేశారో ఆ తరహాలో కన్పించడం గమనార్హం. వాస్తవంగా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిబంధనల ప్రకారం సురక్షిత ప్రమాణాలు తీసుకోవాలి. కానీ ఎంసీఐ, కేంద్ర బృందాలు వచ్చినప్పుడు మాత్రమే వైద్యులు ఈ తరహాలో దర్శనమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment