NABH
-
మన ప్రభుత్వాస్పత్రులకు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, మానసిక ఆరోగ్య ఆస్పత్రులకు అరుదైన గౌరవం లభించింది. రోగులకు అందిస్తున్న అత్యుత్తమ వైద్య సేవలకు గానూ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్‌కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు దక్కింది. తద్వారా దేశంలోనే ఎన్ఏబీహెచ్ గుర్తింపు పొందిన తొలి ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆస్పత్రిగా విశాఖ మానసిక ఆస్పత్రి రికార్డును కైవసం చేసుకుంది. ఈ గుర్తింపు 2027 ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు అధికారికంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఈ రెండు ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు కోసం వైద్య, ఆరోగ్య శాఖ దరఖాస్తు చేసింది. దీంతో ఆస్పత్రుల్లో తనిఖీల అనంతరం ఎన్ఏబీహెచ్ నిర్దేశించిన మేరకు సేవలు అందించడంతోపాటు నిబంధనలు, మార్గదర్శకాలను అమలు చేస్తుండటంతో గుర్తింపు ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు శుక్రవారం సమాచారం అందించారు. నాలుగేళ్లుగా సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట దేశంలో నాణ్యమైన వైద్యసేవల కల్పన, ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్ఏబీహెచ్ను నెలకొల్పింది. ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఇచ్చేందుకు ఒక రోగి ఆస్పత్రిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని తిరిగి వెళ్లే వరకు అందిస్తున్న సేవలు, భద్రత, ఆస్పత్రి నిర్వహణ, వైద్యులు, సిబ్బంది పనితీరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. రోగుల సేవల్లో భాగంగా ఆస్పత్రిలో ఫ్రెండ్లీ, ఆహ్లాదకర వాతావరణం, సెక్యూరిటీ, శానిటేషన్ పక్కాగా నిర్వహణ, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యలు, ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలోనే ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత నాలుగేళ్లలో వసతుల కల్పన నుంచి వైద్యుల నియామకం వరకు అన్ని విధాలుగా ఆస్పత్రులను బలోపేతం చేసింది. దీంతో రాష్ట్రంలోని 443కు పైగా ప్రభుత్వాస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్వా‹Ù) గుర్తింపు లభించింది. ఎన్‌క్వాష్ గుర్తింపులో దేశంలోనే ప్రస్తుతం ఏపీ మొదటి స్థానంలో ఉంది. తాజాగా విశాఖలోని ఛాతీ, మానసిక ఆస్పత్రికి అరుదైన ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషికి దక్కిన గౌరవమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది ఆస్పత్రికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. 300 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిలో మానసిక వ్యాధులతో బాధపడే వారికి చికిత్స అందిస్తున్నాం. ఈ ఆస్పత్రిలో పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సేవలందించేలా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ తరుణంలో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్ఏబీహెచ్ గుర్తింపు దక్కడం విశేషం. ఎన్ఏబీహెచ్ పొందిన దేశంలోనే తొలి ప్రభుత్వ రంగ మానసిక ఆస్పత్రి మన రాష్ట్రానికి చెందినది కావడం ఎంతో గర్వంగా ఉంది. – డాక్టర్ రామిరెడ్డి, సూపరింటెండెంట్, విశాఖ మానసిక ఆస్పత్రి అన్ని ఆస్పత్రులకు నేషనల్ సర్టిఫికేషన్ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రమాణాలను పెంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా సంస్కరణలు చేపట్టాం. పీహెచ్సీ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లోని ఆస్పత్రులను, వాటిల్లోని విభాగాలను ఎన్క్వాన్, లక్ష్య, ముష్కాన్, ఎన్ఏబీహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది సర్టిఫికేషన్ చేయిస్తున్నాం. ఈ క్రమంలోనే విశాఖలోని ఛాతీ, మానసిక ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు వచ్చింది. – ఎంటీ కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ -
సర్కారు ఆస్పత్రులకు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించిన పలు సర్కారు ఆసుపత్రులకు కేంద్రం గుర్తింపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో 35 ప్రభుత్వ ఆసుపత్రులు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) ధ్రువీకరణ పత్రాలు పొందాయి. నాణ్యత ప్రమాణాలను పాటించే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు ఇస్తున్న తరహాలోనే ప్రభుత్వ ఆసుపత్రులకూ ఎన్‌క్వాష్‌ను కేంద్రం ప్రారంభించింది. నాణ్యత ధ్రువీకరణ పత్రాలు పొందిన ఆసుపత్రుల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంది. వాటిల్లో పనిచేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తుంది. గతంలో మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఆసుపత్రి, భద్రాచలం, బాన్సువాడ ఏరియా ఆసుపత్రులు సహా పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్‌క్వాష్ సర్టిఫికెట్లు పొందాయి. కొత్తగా ఎన్‌క్వాష్ సర్టిఫికెట్లు పొందిన ఆసుపత్రులు అనేకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే ఉండటం గమనార్హం. బిక్నూరు, దేవరకొండ, హన్వాడ, బొమ్మలరామారం, కొండమడుగు, ధర్మాసాగర్, గోపాల్పూర్, థరూర్, మనూపాడు, ఎర్రగుంట, గండంపల్లి, కంభాలపల్లి, కంగ్టి, రఘునాధపల్లి, ఘన్పూర్, తాండూరు, కత్లాపూర్, మేడిపల్లి, గారెపల్లి, జైపూర్, శంకరంపట్నం, లీజా, గట్టు, ఆత్మకూర్, సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్‌క్వాష్ సర్టిఫికేట్లు అందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి కూడా సర్టిఫికేట్ వచ్చింది. గతంలో 39 దవాఖానాలకు ఈ ఎన్‌క్వాష్ సర్టిఫికెట్లు ఉండగా, ప్రస్తుత సర్టిఫికెట్లతో ఆస్పత్రుల సంఖ్య 74కు చేరింది. దీంతో ఈ సర్టిఫికెట్లు పొందడంలో దేశంలోనే తెలంగాణ టాప్ గా నిలిచింది. -
నిర్వహణపై నిలదీత
అనంతపురం న్యూసిటీ: ‘ఓపీ స్లిప్పే.. డిశ్చార్జ్ సమ్మరీనా? అన్ని విభాగాల్లో ఈ స్లిప్పులతోనే సరిపెడుతున్నారా. డిశ్చార్జ్ సమ్మరీను ఇలాగేనా ఉంచేది? రోగులు ఫాలో అప్ ట్రీట్మెంట్కు వచ్చినప్పుడు వైద్యులు ఏ విధంగా చికిత్స చేస్తారు. ఇది సరైన పద్ధతికాదు.’ అంటూ నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటర్, హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ సభ్యురాలు(ఎన్ఏబీహెచ్) న్యూఢిల్లీ సెక్రటేరియట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దీపాలీ మన్కర్ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. గురువారం అసిస్టెంట్ డైరెక్టర్ సర్వజనాస్పత్రిలోని మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలు, సురక్షిత ప్రమాణా లపై ఆరా తీశారు. మొదట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఆర్ ఎంఓ డాక్టర్ లలిత, అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ జమాల్‌బాషా, మేనేజర్ శ్వేతతో సమావేశమై రికార్డులను పరిశీలించారు. అనంతరం చిన్నపిల్లల వార్డు, సర్జికల్ వార్డు, అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్(ఏఎంసీ), మెయిన్ ఆపరేషన్ థియేటర్, ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. సర్జికల్ వార్డులో..డిశ్చార్జ్ సమ్మరీ ఎందుకు నిర్వహించడం లేదని హౌస్‌సర్జన్, స్టాఫ్‌నర్సును ప్రశ్నిస్తే ఇండెంట్ పెట్టినా స్టోర్స్ వాళ్లు పంపిణీ చేయలేదన్నారు. కేసు షీట్లో వైద్యుల సంతకాలు లేవని, అలాగే రోగులకందించే మాత్రలు రోజుకు ఏ విధంగా వాడాలో పొందుపర్చేలా చూసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆమె సూచించారు. ఏఎంసీను ఐసీయూ తరహాలోనే చూడాలన్నారు. సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోం ఎన్ఏబీహెచ్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యానికి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దీపాలీ మన్కర్ సూచించారు. ఎన్ఏబీహెచ్ నిబంధనల ప్రకారం 10 చాప్టర్లకు సంబంధించి వైద్యులు, సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాలన్నారు. సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎన్ఏబీహెచ్ బృందం మరోసారి తనిఖీ చేస్తుందన్నారు. 500 పడకలకు సంబంధించి నాణ్యత, సురక్షిత ప్రమాణాలు, మౌళిక సదుపాయాలు, రికార్డు నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. సినీ ఫక్కిలో సిబ్బంది ఎన్ఏబీహెచ్ బృందం వస్తుందని ఆస్పత్రి యాజమాన్యం కొత్త అవతారానికి శ్రీకారం చుట్టింది. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో వైద్యులు, సిబ్బంది అప్రాన్, మాస్క్ ధరించి ప్రత్యేకంగా కన్పించారు. ఆస్పత్రికి వచ్చిన వారు ఇది అనంతపురం ఆస్పత్రేనా? లేక కార్పొరేట్ సెక్టార్లో ఉన్నామా అనే తరహాలో కన్పించారు. అచ్చం శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా తరహాలో డూప్ ఆస్పత్రిని ఏవిధంగా ఏర్పాటు చేశారో ఆ తరహాలో కన్పించడం గమనార్హం. వాస్తవంగా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిబంధనల ప్రకారం సురక్షిత ప్రమాణాలు తీసుకోవాలి. కానీ ఎంసీఐ, కేంద్ర బృందాలు వచ్చినప్పుడు మాత్రమే వైద్యులు ఈ తరహాలో దర్శనమిస్తున్నారు. -
బ్లడ్ బ్యాంకుకు మహర్దశ
జనగామ: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లోని రక్తనిధి కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఖమ్మంతో పాటు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని పైలట్ ప్రాజెక్టు కింద నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్)కు ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల నిర్వహణ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వెళ్లి పోయింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్‌ఏబీహెచ్‌కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం జనగామ ఏరియా ఆస్పత్రిలో 1000 యూనిట్లు సామర్థ్యం ఉన్న రక్తనిధి కేంద్రం పనిచేస్తోంది. ఎన్‌ఏబీహెచ్‌కు పూర్తి అర్హత సాధించేందుకు ఇక్కడి రక్తనిధి కేంద్రంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది కృషి చేస్తున్నారు. అర్హత సాధించాలంటే.. ఆదర్శవంతమైన రక్తనిధి కేంద్రంగా ఏరియా ఆస్పత్రి గుర్తింపు పొందాలంటే కేంద్రం ప్రభుత్వం విధించిన గైడ్‌లైన్స్ తప్పనిసరి. 24 గంటలపాటు ఎయిర్ కండీషన్, యంత్రాల పనితీరు, మెడికల్ ఆఫీసర్, ఐదుగురు టెక్నీషియన్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఒక కౌన్సిలర్, రెండు కంప్యూటర్లు, రెండు టెలివిజన్లు, ప్రింటర్లు, ఒక అంబులెన్స్ ఉండాలి. ఇందులో ఒకస్టాఫ్ నర్సు కొరత ఉండగా, కంప్యూటర్లు, టెలివిజన్లు, అంబులెన్స్ అసలు లేవు. ఎన్‌ఏబీహెచ్‌కు పోటీ పడాలంటే రక్తనిధి కేంద్రంలో స్టాండర్డు క్వాలిటీ ఉండాలి. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో వసతి సౌకర్యాలను జిల్లా, రాష్ట్ర స్థాయి టీంలు పరిశీలిస్తాయి. అనంతరం కేంద్ర బృందం పరిశీలించిన తర్వాతనే అర్హత సర్టిఫికెట్‌ను అందజేస్తారు. రాష్ట్ర బృందం పరిశీలన ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని ఇటీవల స్టేట్ క్వాలిటీ ఆఫీసర్ నిరంజన్ పరిశీలించారు. రక్తనిధి నిల్వల సామర్థ్యం, రికార్డులు, పని తీరుపై మెడికల ఆఫీసర్ రాంనర్సయ్య, పీఆర్వో రాము, రజిని, రాజేశ్వర్, వెంటస్వామిని అడిగి తెలుసుకున్నారు. -
ఎన్ఏబీహెచ్ గుర్తింపు కోసం సర్వే
నోయిడా: ఆస్పత్రుల జాతీయ గుర్తింపు సంస్థ (ఎన్ఏబీహెచ్) ధ్రువపత్రం కోసం గౌతమబుద్ధ నగర్ జిల్లా ఆస్పత్రి దరఖాస్తు చేసుకోగా, అధికారులు ఇందుకోసం సర్వే నిర్వహిస్తున్నారు. ఇక్కడి వైద్యసదుపాయాలు, సాధించిన విజయాలు, రికార్డులు, రోగుల సంతృప్తి తదితర అంశాలను ఎన్ఏబీహెచ్ అధికారులు మదింపు చేస్తున్నారు. ప్రతి విభాగం రోగులకు అందజేసే వైద్యసేవల ఆధారంగా గుర్తింపు (అక్రిడేషన్)నకు అర్హులా కాదా అన్నది నిర్ధారిస్తారు. సదరు ఆస్పత్రి పాటిస్తున్న వైద్యప్రమాణాలు, దక్కించుకున్న అవార్డుల వివరాలను పరిశీలిస్తారు. వీటన్నింటిని తనిఖీ చేసేందుకు ఎన్ఏబీహెచ్ అధికారులు ఇద్దరు ఇటీవలే తమ ఆస్పత్రికి వచ్చారని, రెండు నెలలపాటు ఇక్కడే ఉండి సర్వే పూర్తి చేస్తారని జిల్లా ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి ఆర్ఎన్పీ మిశ్రా వివరించారు. తాము అవసరమైనప్పుడల్లా ఈ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ‘ఆస్పత్రిలో ఇంకా ఏమేం చేయాలో వాళ్లు మాకు విశదీకరిస్తున్నారు. మా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వైద్యసదుపాయాలు, పరికరాలు, వ్యాధి నిర్ధారణ సేవలను పరిశీలన చేస్తున్నారు’ అని మిశ్రా తెలిపారు. వీటికితోడు ఎన్ని కేసుల్లో వైద్యపరమైన లోపాలు, రక్తసరఫరా విఫలమవడం, ఆపరేషన్లు చేసిన ప్రదేశాల్లో ఎన్ని ఇన్ఫెక్షన్లు వచ్చాయి... పడకల వినియోగం రేటు, రోగులు ఎంతకాలం ఆస్పత్రిలో ఉంటున్నారు.. వంటి ప్రమాణాల ఆధారంగా గుర్తింపు మంజూరు చేస్తారని ఎన్ఏబీహెచ్ వర్గాలు తెలిపాయి. వైద్యచికిత్సల ఫలితాల సరళి, రోగుల రికార్డులను అధ్యయనం చేస్తారు. వీటిపై తరచూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి డాక్టర్లతో చర్చిస్తారు. ఏయే ప్రమాణాలను పాటించడంలో ఆస్పత్రి విఫలమవుతుందనే వివరాలను కూడా ఆస్పత్రి యాజమాన్యానికి అందజేస్తారు. ఎన్ఏబీహెచ్ గుర్తింపు రావడం వల్ల అందరికంటే రోగులకే అధిక ప్రయోజనం ఉంటుందని ఇక్కడి డాక్టర్లు తెలిపారు. దీని నుంచి ధ్రువపత్రం వస్తే జిల్లా ఆస్పత్రిలో అత్యంత నాణ్యతగల వైద్యచికిత్స సదుపాయాలు లభిస్తాయని సీనియర్ డాక్టరు ఒకరు ఈ సందర్భంగా వివరించారు.