నోయిడా: ఆస్పత్రుల జాతీయ గుర్తింపు సంస్థ (ఎన్‌ఏబీహెచ్) ధ్రువపత్రం కోసం గౌతమబుద్ధ నగర్ జిల్లా ఆస్పత్రి దరఖాస్తు చేసుకోగా, అధికారులు ఇందుకోసం సర్వే నిర్వహిస్తున్నారు. ఇక్కడి వైద్యసదుపాయాలు, సాధించిన విజయాలు, రికార్డులు, రోగుల సంతృప్తి తదితర అంశాలను ఎన్‌ఏబీహెచ్ అధికారులు మదింపు చేస్తున్నారు. ప్రతి విభాగం రోగులకు అందజేసే వైద్యసేవల ఆధారంగా గుర్తింపు (అక్రిడేషన్)నకు అర్హులా కాదా అన్నది నిర్ధారిస్తారు. సదరు ఆస్పత్రి పాటిస్తున్న వైద్యప్రమాణాలు, దక్కించుకున్న అవార్డుల వివరాలను పరిశీలిస్తారు. వీటన్నింటిని తనిఖీ చేసేందుకు ఎన్‌ఏబీహెచ్ అధికారులు ఇద్దరు ఇటీవలే తమ ఆస్పత్రికి వచ్చారని, రెండు నెలలపాటు ఇక్కడే ఉండి సర్వే పూర్తి చేస్తారని జిల్లా ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి ఆర్‌ఎన్‌పీ మిశ్రా వివరించారు.
తాము అవసరమైనప్పుడల్లా ఈ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ‘ఆస్పత్రిలో ఇంకా ఏమేం చేయాలో వాళ్లు మాకు విశదీకరిస్తున్నారు. మా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వైద్యసదుపాయాలు, పరికరాలు, వ్యాధి నిర్ధారణ సేవలను పరిశీలన చేస్తున్నారు’ అని మిశ్రా తెలిపారు. వీటికితోడు ఎన్ని కేసుల్లో వైద్యపరమైన లోపాలు, రక్తసరఫరా విఫలమవడం, ఆపరేషన్లు చేసిన ప్రదేశాల్లో ఎన్ని ఇన్ఫెక్షన్లు వచ్చాయి... పడకల వినియోగం రేటు, రోగులు ఎంతకాలం ఆస్పత్రిలో ఉంటున్నారు.. వంటి ప్రమాణాల ఆధారంగా గుర్తింపు మంజూరు చేస్తారని ఎన్‌ఏబీహెచ్ వర్గాలు తెలిపాయి. వైద్యచికిత్సల ఫలితాల సరళి, రోగుల రికార్డులను అధ్యయనం చేస్తారు.
వీటిపై తరచూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి డాక్టర్లతో చర్చిస్తారు. ఏయే ప్రమాణాలను పాటించడంలో ఆస్పత్రి విఫలమవుతుందనే వివరాలను కూడా ఆస్పత్రి యాజమాన్యానికి అందజేస్తారు. ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు రావడం వల్ల అందరికంటే రోగులకే అధిక ప్రయోజనం ఉంటుందని ఇక్కడి డాక్టర్లు తెలిపారు. దీని నుంచి ధ్రువపత్రం వస్తే జిల్లా ఆస్పత్రిలో అత్యంత నాణ్యతగల వైద్యచికిత్స సదుపాయాలు లభిస్తాయని సీనియర్ డాక్టరు ఒకరు ఈ సందర్భంగా వివరించారు.
ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు కోసం సర్వే
Published Tue, Jul 1 2014 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement