సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, మానసిక ఆరోగ్య ఆస్పత్రులకు అరుదైన గౌరవం లభించింది. రోగులకు అందిస్తున్న అత్యుత్తమ వైద్య సేవలకు గానూ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్‌కేర్ ప్రొవైడర్స్(ఎన్‌ఏబీహెచ్) గుర్తింపు దక్కింది. తద్వారా దేశంలోనే ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు పొందిన తొలి ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆస్పత్రిగా విశాఖ మానసిక ఆస్పత్రి రికార్డును కైవసం చేసుకుంది.
ఈ గుర్తింపు 2027 ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు అధికారికంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఈ రెండు ఆస్పత్రులకు ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు కోసం వైద్య, ఆరోగ్య శాఖ దరఖాస్తు చేసింది. దీంతో ఆస్పత్రుల్లో తనిఖీల అనంతరం ఎన్‌ఏబీహెచ్ నిర్దేశించిన మేరకు సేవలు అందించడంతోపాటు నిబంధనలు, మార్గదర్శకాలను అమలు చేస్తుండటంతో గుర్తింపు ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు శుక్రవారం సమాచారం అందించారు.
నాలుగేళ్లుగా సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట
దేశంలో నాణ్యమైన వైద్యసేవల కల్పన, ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్‌ఏబీహెచ్‌ను నెలకొల్పింది. ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు ఇచ్చేందుకు ఒక రోగి ఆస్పత్రిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని తిరిగి వెళ్లే వరకు అందిస్తున్న సేవలు, భద్రత, ఆస్పత్రి నిర్వహణ, వైద్యులు, సిబ్బంది పనితీరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
రోగుల సేవల్లో భాగంగా ఆస్పత్రిలో ఫ్రెండ్లీ, ఆహ్లాదకర వాతావరణం, సెక్యూరిటీ, శానిటేషన్ పక్కాగా నిర్వహణ, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యలు, ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలోనే ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
గత నాలుగేళ్లలో వసతుల కల్పన నుంచి వైద్యుల నియామకం వరకు అన్ని విధాలుగా ఆస్పత్రులను బలోపేతం చేసింది. దీంతో రాష్ట్రంలోని 443కు పైగా ప్రభుత్వాస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్వా‹Ù) గుర్తింపు లభించింది. ఎన్‌క్వాష్ గుర్తింపులో దేశంలోనే ప్రస్తుతం ఏపీ మొదటి స్థానంలో ఉంది. తాజాగా విశాఖలోని ఛాతీ, మానసిక ఆస్పత్రికి అరుదైన ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు లభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషికి దక్కిన గౌరవమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది
ఆస్పత్రికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. 300 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిలో మానసిక వ్యాధులతో బాధపడే వారికి చికిత్స అందిస్తున్నాం. ఈ ఆస్పత్రిలో పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సేవలందించేలా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ తరుణంలో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు దక్కడం విశేషం. ఎన్‌ఏబీహెచ్ పొందిన దేశంలోనే తొలి ప్రభుత్వ రంగ మానసిక ఆస్పత్రి మన రాష్ట్రానికి చెందినది కావడం ఎంతో గర్వంగా ఉంది.
– డాక్టర్ రామిరెడ్డి, సూపరింటెండెంట్, విశాఖ మానసిక ఆస్పత్రి
అన్ని ఆస్పత్రులకు నేషనల్ సర్టిఫికేషన్
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రమాణాలను పెంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా సంస్కరణలు చేపట్టాం. పీహెచ్‌సీ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లోని ఆస్పత్రులను, వాటిల్లోని విభాగాలను ఎన్‌క్వాన్, లక్ష్య, ముష్కాన్, ఎన్‌ఏబీహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది సర్టిఫికేషన్ చేయిస్తున్నాం. ఈ క్రమంలోనే విశాఖలోని ఛాతీ, మానసిక ఆస్పత్రులకు ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు వచ్చింది. – ఎంటీ కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment