ఒంగోలు టౌన్: జిల్లాకు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీరు విడుదల సాఫీగా సాగేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. వారి పరిధిలో సంబంధిత మండలాలకు చెందిన అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ నీరు జిల్లాకు విడుదలైన వెంటనే ఎక్కడా నీటిని పంట పొలాలకు వాడుకోకుండా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, మంచినీటి పథకాలను నింపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ మంగళవారం సాయంత్రం ఆదేశించారు.
నాగార్జునసాగర్ నీటిని జిల్లాలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులతోపాటు 99 మంచినీటి పథకాలను నింపాలని సూచించారు. ఎక్కడైనా ఇంజిన్లు ఏర్పాటుచేసి నీటిని పంట పొలాలకు ఉపయోగిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి జిల్లాకు 18వ మైలు రాయి అయిన అద్దంకి బ్రాంచ్ కెనాల్‌కు సంతమాగులూరు మండలం అడవిపాలెం నుంచి, 85/3 మైలు అయిన కురిచేడు మండలం త్రిపురాంతకం గ్రామం నుంచి జిల్లాకు నీరు విడుదలవుతోంది.
ఈ నేపధ్యంలో నీరు సజావుగా విడుదలయ్యేందుకు వీలుగా జిల్లా అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను పుల్లలచెరువు మండలం మన్నేపల్లి గ్రామం నుంచి కురిచేడు వరకు సాగర్ నీటిని పర్యవేక్షించనున్నారు. స్టెప్ సీఈఓ దర్శి బ్రాంచ్ కెనాల్ నుంచి తాళ్లూరులోని రాజంపల్లి మేజర్ వరకు పర్యవేక్షించనున్నారు. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ తాళ్లూరు మండలంలోని కరవది మేజర్ నుంచి కారుమంచి మేజర్ వరకు పర్యవేక్షించనున్నారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సంతమాగులూరు మండలంలోని అడవిపాలెం గ్రామం నుంచి బల్లికురవ మండలం వైదన గ్రామం వరకు, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డెరైక్టర్ వైదన నుంచి ఇంకొల్లు మండలం జంగమహేశ్వరపురం వరకు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ జంగమహేశ్వరపురం నుంచి కారంచేడు మండలం సూదివారిపాలెం వరకు పర్యవేక్షించనున్నారు.
స్పెషల్ ఆఫీసర్ల పరిధిలో సంబంధిత మండల తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు డీఈఈలు ఉంటారు.
నాగార్జునసాగర్ కాలువ ద్వారా నీరు విడుదలైన తరువాత ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 10 గంటలకు కాలువ గట్లపై అధికారుల బృందం పోలీసులతో కలిసి పర్యవేక్షించనుంది. ఎక్కడైనా రైతులు నిబంధనలకు విరుద్ధంగా సాగర్ నీటిని పొలాలకు మళ్లిస్తే యుద్ధప్రాతిపదికన వాటిని తొలగించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి పరిస్థితులను బట్టి నేరుగా తనతో లేదా జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడాలని సూచించారు. ఏరోజుకారోజు నివేదికలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు.
సాగర్ నీటి కోసం స్పెషల్ ఆఫీసర్ల నియామకం
Published Wed, Mar 9 2016 3:57 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement