ఎన్నికల్లో నేనే ఖర్చుపెడతా నేనే గెలిపిస్తా..
పార్టీ నేతలకు చంద్రబాబు హామీ
♦ అన్ని పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకుంటా..
♦ ఇకపై ఎన్నికలన్నీ ఏకపక్షంగా జరగాలి
♦ వలసలను ప్రోత్సహిద్దాం, చేరేవారితో సమన్వయం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖర్చు గురించి పార్టీ ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ ఆలోచించవద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంతా తానే చూసుకుంటానని వారికి హామీనిచ్చారు. తానే ఖర్చుచేసి తానే గెలిపిస్తానన్నారు. గురువారం సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు నాలుగు గంటలపాటు సమావేశమయ్యారు. రాష్ర్టంలో రాజకీయ పరిస్థితులతో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల వారిని టీడీపీలో చేర్చుకుంటానని, ఎవ్వరూ అడ్డు చెప్పొద్దని, కొత్తగా పార్టీలో చేరిన వారితో సమన్వయంగా ముందుకు వెళ్లాలని తన పార్టీవారికి హితబోధ చేశారు. రాష్ర్టంలో సింగపూర్ తరహా రాజకీయం రావాలని, ఎన్నికలు ఏకపక్షంగా జరిగి అన్నింటిలో తామే గెలవాలని ఆశించారు. ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలి కాబట్టి ఒకటి, రెండు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండాలని చంద్రబాబు చెప్పారని టీడీపీ వర్గాల సమాచారం.
రాష్ర్టంలో రెండో పార్టీ మనుగడ సాధించకూడదనే లక్ష్యంతో అందరూ పని చేయాలని సూచించారు. సింగపూర్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ఒకే పార్టీ ప్రతి ఎన్నికలోనూ విజయం సాధిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఉండాలనే ఉద్దేశంతో సింగపూర్‌లో రెండు, మూడు సీట్లను విపక్షాలకు కేటాయిస్తారని, ఇక్కడ కూడా అలానే చేసే పరిస్థితి రావాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి 50 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 మండలి స్థానాలు పెరుగుతాయని, పార్టీలో ఉన్న, చేరే వారిలో అప్పటికి సమర్థులు ఎవరో గుర్తించి టిక్కెట్లు ఇప్పించి గెలిపిస్తానన్నారు.
మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమన్వయంతో పని చేసుకోవాలని, రెండు వారాలకో మారు సమావేశమై జిల్లాల్లో రాజకీయ, ఇతర పరిస్థితులను సమీక్షించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతి మూడు నెలలకోమారు అంచనా వేసి టిక్కెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రన్నవాడ పేరుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల సముదాయాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఏప్రిల్ 14న ప్రారంభించే గృహాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేస్తామని అయితే కేటాయింపులు మాత్రం వారి వాటా చెల్లించిన వెంటనే చేస్తామన్నారు.
ఢిల్లీలో పార్టీ కార్యాలయం
ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. పార్టీకి పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 1,800 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తారని, అందులో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు.
మనుమడి పుట్టిన రోజు సందర్భంగా విందు
ఏప్రిల్ 8న(ఉగాది) తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో 1,500 మందికి విందు ఇవ్వనున్నట్లు చెప్పారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సివిల్ సర్వీస్ అధికారులు పాల్గొననున్నారు.
సీఎంను కలిసిన నిమ్మగడ్డ..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కానున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రీస్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు
రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను తక్షణమే ప్రీస్కూళ్లుగా మార్చాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రీస్కూళ్ల కోసం ఈ ఏడాది ఐదు వేల సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో అన్ని విభాగాల అధిపతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.