45 మంది సభ్యులతో టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలన్న అధిష్టానం
90 మందితో ఉండాలని జిల్లా నేతల పట్టు
అందుకే కమిటీ ప్రకటనలోజాప్యం
చంద్రబాబు దృష్టికి‘జంబో’ సమస్య
జెండా మోసిన కార్యకర్తలను పక్కనపెట్టి అనుచరులకే చోటు కల్పిస్తోన్న నేతలు
మినీ మహానాడులో నిలదీసేందుకు సిద్ధమైన కార్యకర్తలు
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందా? ఏళ్లుగా పార్టీ ఉన్నతి కోసం శ్రమించిన వారిని పక్కనపెట్టి అస్మదీయులైన వారికే ‘అనంత’ నేతలు జిల్లా కమిటీలో చోటు కల్పిస్తున్నారా? మినీ మహానాడులో నేతల తీరును కార్యకర్తలు ఎండగట్టనున్నారా?... ప్రస్తుతం టీడీపీలో పరిణామాలను బేరీజు వేస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటు ‘అనంత’ నేతలకు పెద్ద సమస్యగా మారింది. పదేళ్ల తర్వాత ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుంది. ఈ కాలంలో పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడిన కార్యకర్తలు కమిటీలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. నేతలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. చోటుకల్పించడం కుదరదని చెబుతున్నారు.
ఇదీ అసలు సమస్య
టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. మొదట ఈ నెల 16న ఏర్పాటు చేయాలని భావించారు. అయితే..వివాదం తలెత్తింది. గతేడాది 117 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 45 మందితోనే నియమించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లా నేతలు ససేమిరా అన్నారు. 117 మందితో ఏర్పాటు చేయాలని, 45 మంది అంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని ఎన్నికల పరిశీలకులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సీఎం రమేశ్‌తో చెప్పారు. దీన్ని వారు పరిగణనలోకి తీసుకోలేదు.
కనీసం 90 మందితోనైనా ఏర్పాటు చేయాలంటూ జాబితాను పరిశీలకుల చేతికిచ్చారు. అన్ని జిల్లాల్లో 45 మందితోనే నియమిస్తున్నామని, ‘అనంత’లో మాత్రం వేరుగా కుదరదని పరిశీలకులు తేల్చిచెప్పారు. కావాలంటే అనుబంధ సంఘాలు, రాష్ట్ర కమిటీలో చోటు కల్పించుకోండని సూచించారు. అనుబంధ సంఘాలు, రాష్ట్ర కమిటీలో ఏటా 400 మందికి చోటు లభిస్తోంది. ఈసారి ఈ సంఖ్యను కూడా సగానికి తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్ 90 మందితో కూడిన జాబితాను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దానికి చంద్రబాబుతో ఆమోదముద్ర వేయించేలా కేశవ్, బీకే పార్థసారథి, వరదాపురం సూరి ప్రయత్నిస్తున్నారు.
మినీ మహానాడులో నిలదీసేందుకు సిద్ధం
ప్రస్తుతం నేతలు ఇచ్చిన 90 మంది పేర్లపై కూడా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం శ్రమించిన వారిని కాదని, నేతలు చుట్టూ ఉన్నవారికే పదవులు కట్టబెడుతున్నారని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒకరు ‘సాక్షి’తో అన్నారు. అధిష్టానం అనుకున్నట్లు 45 మందితో కమిటీని ప్రకటిస్తే నియోజకవర్గానికి 4-5 మందికి కూడా అవకాశం రాదని ఆయన విశ్లేషించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి పని చేసేందుకు కమిటీలో చోటు కల్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ నెల 23న ధర్మవరంలో జరిగే మినీ మహానాడులో ఇదే విషయాన్ని ప్రశ్నించేందుకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే మహానాడులో నేతల వైఖరిని కార్యకర్తలు కచ్చితంగా నిలదీస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. జిల్లా కమిటీ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడుగా బీకే పార్థసారథి, ప్రధాన కార్యదర్శిగా వరదాపురం సూరి, ప్రచార కార్యదర్శిగా బీవీ వెంకట్రాముడుతో పాటు 90 మంది పేర్లతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానానికి పంపారు. మరో రెండుర ోజుల్లో కమిటీని ప్రకటిస్తామని పరిశీలకులు ఈ నెల 17న జిల్లాలో చెప్పారు. అయితే.. ఇప్పటి వరకూ ప్రకటన చేయలేదు. 90 మంది పేర్లకు అధిష్టానం ససేమిరా అంటోందని, 45 మందితోనే కమిటీ ప్రకటిస్తారని ఓ కీలక నేత చెప్పారు.
ప్రాధాన్యతివ్వండి
Published Thu, May 21 2015 3:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement