ఆమంచి కృష్ణమోహన్
ఒంగోలు: ప్రకాశం జిల్లా టిడిపి మినీ మహానాడులో రభస జరిగింది. చీరాలలో గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. అతనిని పార్టీలోకి రానివ్వొద్దని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టిడిపి అధిష్టానం ఆమంచిని పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో కార్యకర్తలు వ్యతిరికేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత టీడీపీ నాయకులు పోతుల సునీత, పాలేటి రామారావులు ఆమంచిని తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఆమంచి కృష్ణమోహన్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమంచి కృష్ణమోహన్ టిడిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అతనిని పార్టీలో చేర్చుకోవడానికి సాంకేతికపరమైన ఇబ్బందులేమైనా ఉంటే ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా ఆమంచిని కొనసాగించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడుని కలవడానికి ముందు ఆమంచి జనసేన వ్యవస్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా కలిశారు. ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు.
ఇదిలా ఉండగా, ఆమంచి చేరిక విషయంలో కొంత మంది టీడీపీ సుముఖంగా ఉండగా, మరి కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టిడిపి బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన శ్రీరాం మాల్యాద్రికి చీరాల శాసనసభ స్థానంలో ఆధిక్యత ఓట్లు లభించాయి. ఇది ఆమంచిని ఆ పార్టీలో చేర్చుకోవడానికి ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆమంచి తన పట్టును నిరూపించుకున్నారు. ఈ పరిస్థితులలో అతనిని టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక టిడిపి కార్యకర్తలు మాత్రం ఆమంచి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.