‘మా నియోజకవర్గాలకు మేమే రాజులం.. మాకు ఎవరితోనూ సంబంధం లేదు. అధినేత చంద్రబాబునాయుడు కాదు కదా మరెవరు చెప్పినా మాపని మాదే.. మాకు నచ్చిన వారినే పిలుస్తాం. నచ్చని వారిని పిలిచి కలుపుకెళ్లాల్సిన పని లేదు.’ ఇది జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిల తీరు. జిల్లాలో నాలుగు రోజులుగా నియోజకవర్గాల్లో మినీ మహనాడు కార్యక్రమం సాగుతోంది. కార్యక్రమాలు కూడా ఇన్‌చార్జిలు ఎవరికి వారుగానే ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు తప్ప పార్టీ ప్రొటోకాల్ పాటిస్తున్న దాఖలాల్లేవు. దీంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్లమెంట్ ఇన్‌చార్జి నేతగా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డిని ఆ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లోని కార్యక్రమాలకు ఆహ్వానించకపోవటం, కోవూరు సీనియర్ నేతగా ఉన్న పెళ్లకూరు విషయంలోనూ నేతలు అదే తీరు ప్రదర్శిస్తుండటంతో ఆ నాయకులు ఇద్దరూ అసంతృప్తిలో ఉన్నారు. దీంతో అధికార పార్టీ అంతర్గత రాజకీయలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మినీ మçహానాడు కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపున్చింది. దీనికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు నేతలను పరిశీలన కోసం కమిటీని నియమించారు. పార్టీ విధివిధానాలకు లోబడి కార్యక్రమాలు జరగాల్సి ఉంది. అయితే ఇన్‌చార్జిలు ఇష్టానుసారంగా వారికి కావాల్సిన నేతల్నే ఆహ్వానించటం, మిగిలిన సీనియర్ నేతలను ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించకపోవటం తదితర ఘటనలతో నాయకుల తీరు మారలేదని సృష్టం అయింది. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గానూ ఇప్పటి వరకు సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, నెల్లూరు సిటీ, కోవూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాల్లో మినీ మహానాడులు జరిగాయి. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో జరగాల్సి ఉంది. 20వ తేదీన ఉదయగిరి, 21న నెల్లూరు రూరల్, 22న కావలి, 24న జిల్లా మహానాడు జరగనుంది. ఈ క్రమంలో పార్టీ అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
పనిచేయని బాబు హితబోధ
గత వారంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జిల్లా నేతలకు సుదీర్ఘక్లాస్ తీసుకున్నారు. పార్లమెంట్ స్థాయిలో పార్టీల సమీక్షలో భాగంగా జిల్లా నేతలతో అమరావతిలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడాలని హితబోధ చేస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఒక్కొక్కరితో మాట్లాడి క్లాస్ తీసుకున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యేను గెస్ట్ ఎమ్మెల్యేలా కాకుండా నియోజకవర్గంలో ఎక్కువ సమయం ఉండి పనిచేయాలని చెప్పారు. అలాగే కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పార్టీ సీనియర్ నేతలను కలుపుకుని వెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని హితబోధ చేశారు. ఇదేసమావేశంలో నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి నేతల తీరుపై అధినేత సమక్షంలోనే ఫైర్ అయ్యారు. జిల్లాలో పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, తనకు పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాలకు తనకి ఆహ్వానం ఉండటం లేదని చెప్పారు. చివరకు తాను ఇన్‌చార్జిగా ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనూ మంత్రి సోమిరెడ్డి జోక్యం ఎక్కువఅయిందని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ నేతలు అందరూ కలసి పనిచేయాలని నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు ఆదాలను పిలవాలని బాబు సూచించారు. అలాగే సీనియర్ నేతలకు గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఆదాల, పెళ్లకూరుకు ఆహ్వానాలు లేవు
చంద్రబాబు జిల్లా నేతలకు వారం రోజులు కూడా గడవక ముందే నేతలు యథావిధిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలో జరిగిన సిటీ మహానాడు, కోవూరులో జరిగిన కార్యక్రమాలకు ఆదాలకు ఆహానాలు లేవు. రెండు చోట్ల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డే అతిథిగా హాజరయ్యారు. ఇక కోవూరు పార్టీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి కూడా ఆహ్వానాలు అందలేదు. కోవూరు మహానాడు ఇనమడుగులో నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. మంత్రి హుటాహుటిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని సభకు తీసుకెళ్లారు. తనకు ఆహ్వానం లేదని తాను రానని చెప్పినా మంత్రి ఒత్తిడి చేసి తీసుకెళ్లారు. తనకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని మంత్రి వద్ద పెళ్లకూరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై పార్టీ అధినేత బాబుకు ఫిర్యాదు చేస్తానని మంత్రికి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో సభకు వెళ్లి మంత్రితో వెంటనే తిరిగి వచ్చేటంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద జిల్లా పార్టీలో ఇదే తరహా రగడ అన్ని చోట్ల కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment