► మోసకారి అని మరోసారి నిరూపించుకున్నారు
► రూ.35 వేల కోట్లకు ఐదొందల కోట్లు కేటాయిస్తారా?
► వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ధ్వజం
ఏఎన్‌యూ : నిరుద్యోగ భృతి విషయంలో మాటతప్పి చంద్రబాబు మరోసారి మోసకారిగా నిరూపించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆరోపించారు. నిరుద్యోగ భృతికి రాష్ట్ర బడ్జెట్‌లో తక్కువ నిధులను కేటాయించటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో 1.75 కోట్ల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు 35వేల కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్‌లో కంటితుడుపుగా 500 కోట్ల రూపాయలు భిక్షంలా కేటాయించారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం లేకపోతే 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత దానిని విస్మరించారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఏమాత్రం ఉపయోగపడని నిధులు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే దానికి టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటన్నారు.
టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులకు నిరుద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఇంటిముందు ధర్నా చేయాలన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు, యువకులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నిరుద్యోగ భృతి విషయంలో హామీలను నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యువకులు సిద్ధమవుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం గుంటూరు నగర అధ్యక్షుడు ఎలుకా శ్రీకాంత్ యాదవ్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు విఠల్, వినోద్, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాజి, విద్యార్థి విభాగం ఏఎన్‌యూ నాయకుడు ఆదినారాయణ, గుంటూరు నగర నాయకులు నిర్మల్, మస్తాన్‌వలి, విమల్, వినయ్, తేజ, అనిల్, రాజశేఖర్ పాల్గొన్నారు.