కాంగ్రెస్, టీడీపీల వల్లే నల్గొండకు సమస్యలు: కేసీఆర్
నల్గొండ: కాంగ్రెస్, టీడీపీలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ పాలన వల్లే నల్గొండను సమస్యలు పట్టిపీడిస్తున్నాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ని హెచ్చరికలు చేసినా ఈపార్టీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని అన్నారు. పదహారు, పదిహేడేళ్లకు పైగా మంత్రి పదవులు అనుభవిస్తున్నమంత్రులు పట్టించుకోలేదని అందుకే నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ సమస్య పీడిస్తోందన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే నలబై ఏళ్లుగా పెండింగ్‌లోఉన్న ఎస్‌ఎల్‌బీసీ కాలువ నీళ్లను జిల్లాలో ఉరికిపిస్తానని, అవసరమైతే తానే కాలువ గట్టుపై కూర్చుని తవ్విస్తానన్నారు. కాంగ్రెస్ మంత్రుల పదవీ కాలమంతా అసమర్థుల జీవయాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా సమస్యలు పరిష్కరించలేని కాంగ్రెస్, టీడీపీ నేతలు సిగ్గులేకుండా ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తున్నారని, ఇప్పుడు మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.