రేపు రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన నందమూరి హరికృష్ణ గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్‌లో చైర్మన్ హమీద్ అన్సారీకి సమర్పించనున్నారు. గత కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో సమైక్య నినాదం ఎత్తుకున్న హరికృష్ణ తాజాగా రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాలో చర్చనీయాంశమైంది.
తెలుగు ప్రజలను విడదీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. రాష్ర్ట సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆయన రాజ్యసభలో తెలుగులోనే ప్రసంగించడంతో అధ్యక్ష హోదాలో ఉన్న కురియన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలుగు వాడినని, తెలుగులోనే ప్రసంగిస్తానని చెప్పడంతో కురియన్ మెత్తబడిన సంగతి తెలిసిందే.
'తాంబూలాలిచ్చాం, తన్నుకు చావండి’ అన్న రీతిలో విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించిందంటూ టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిర్ణయంతో రాష్ట్రం తగులబడుతోందన్నారు. ప్రజలను విడదీయొద్దని, ఎంతోమంది మహానుభావులు పుట్టిన పుణ్యభూమిని ముక్కలు చేయొద్దంటూ ఆవేశంతో ఊగిపోయారు. దాదాపు 60 ఏళ్ల పాటు కలిసున్న తెలుగు ప్రజలను విడదీసే హక్కు కాంగ్రెస్‌కు ఎవరిచ్చారంటూ తూర్పారబట్టారు.