'నంద్యాల అభ్యర్థిని చంద్రబాబే నిర్ణయిస్తారు'
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నిర్ణయిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా తాము గెలుపు కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. కాగా నంద్యాల అసెంబ్లీ సీటు తమదంటే తమదని శిల్పా, భూమా వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయం వచ్చాకే అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది. నంద్యాల టిక్కెట్ విషయంపై మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారనే సమాచారంతో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ వేగంగా పావులు కదిపారు.
శిల్పా సోదరుల కంటే ముందుగానే సీఎంతో భేటీ అయ్యారు. తన తండ్రి మరణించడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి తమ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని మరోసారి కోరారు. తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తమ కుటుంబ అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎంకు తేల్చిచెప్పారు. దీనికి సీఎం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించవద్దని అఖిలప్రియను ఆదేశించడంతో ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీదే తుది నిర్ణయమని తన తల్లి శోభానాగిరెడ్డి మూడో వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న అఖిలప్రియ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. దీనిపై చర్చిచేందుకు రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని ఆమె తెలిపారు. మరోవైపు శిల్పామోహన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సీఎం శతవిధాలా ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌తో పాటు మోహన్‌రెడ్డి కుమారునికి ఎంపీ టిక్కెట్ కూడా ఆఫర్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అంతే కాకుండా మంత్రి పదవిని కూడా ఇస్తామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అయితే భూమానాగిరెడ్డి మంత్రి పదవి ఉదంతం నేపథ్యంలో సీఎం మాటలను నమ్మేందుకు శిల్పామోహన్‌రెడ్డి సుముఖంగా లేరని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద మరో రెండు, మూడు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం విషయంలో అధికార పార్టీ వ్యవహారం తేటతెల్లం కానుంది.