ఈసీ కొరడా.. టీడీపీ కొంపకొల్లేరే..!
సాక్షి, నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని యధేచ్చగా అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి షాక్ తగిలింది. నిబంధనలను పట్టించుకోకుండా టీడీపీ చేసిన చిన్న తప్పే ఆ పార్టీ పాలిట శాపంగా మారబోతోంది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ తరఫు ప్రచారం నిర్వహించిన స్టార్ క్యాంపెయినర్ల ఖర్చును అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డి ఖర్చు కిందే లెక్కయనుంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు చేయొచ్చు. అభ్యర్థి తరఫు ప్రచారం నిర్వహించే వారి ప్రచారానికి అయ్యే ఖర్చుకు, అభ్యర్థి తన ప్రచారానికి చేసే ఖర్చుకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే, అభ్యర్థి తరఫు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారో.. వారందరి పేర్లను ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వారంలోగా ఎన్నికల కమిషన్‌కు అందించాల్సివుంటుంది.
టీడీపీ చేసిన తప్పేంటి..
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నంద్యాల ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన వారం రోజుల్లోగా తమ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరఫు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారన్న వివరాలను ఈసీకి అందించలేదు. నోటిఫికేషన్ వెలువడిన రెండు వారాల తర్వాత ప్రచారానికి వెళ్లే స్టార్ క్యాంపెయినర్ల వివరాలను టీడీపీ ఈసీకి పంపింది.
దీంతో ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహించిన స్టార్ క్యాంపెయినర్ల ఖర్చులను భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల ఖర్చు కింద ఈసీ లెక్కయనుంది. ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ.28 లక్షలు దాటినట్లయితే.. ఒక వేళ నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించినా దాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, కమెడియన్ వేణు మాధవ్, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.
ముందే ఇచ్చేసిన వైఎస్‌ఆర్‌సీపీ..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరఫు నంద్యాలలో ప్రచారం నిర్వహించనున్న 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్ల జాబితాను ఆగస్ట్ 2వ తేదీనే ఎన్నికల కమిషన్‌కి పంపింది.