పట్టణంలో రహదారులను విస్తరించాలని, గుంటలను పూడ్చాలని రాజకీయేతర పక్షాలు ఆందోళనను ఉధృతం చేశాయి. ఇరుకు రోడ్లతో జనం ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవటం లేదని అరోపించారు. మంచి రహదారులున్న కడప, తాడిపత్రి, కర్నూలు నుంచి నీరు, మట్టి సేకరించి తీసుకువచ్చి స్థానిక మున్సిపల్ కార్యాలయం చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు.
గత నెలలో పట్టణంలో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదని ఆరోపించారు. రహదారుల పోరాట సమితి పేరుతో ఏర్పాటైన స్థానిక స్వచ్చంద సంస్థలు, విద్యా సంస్థల నిర్వాహకులు, దాదాపు 8 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.