చల్లని అభిమానం
వైఎస్ జగన్ జనభేరి సభలు జనసంద్రం
మండుటెండలో చల్లని అభిమానం. కుమ్మక్కు రాజకీయాలు.. విశ్వసనీయతకు నడుమ సాగుతున్న పోరులో ‘గాలి’ ఎటువైపుందో తేలిపోయింది. రాజన్న బిడ్డకు జగమంత కుటుంబం అండగా మేమున్నామంటూ భరోసానిచ్చింది. ఆయన రాక ఆలస్యమైనా.. భానుడు ఉగ్రరూపం దాల్చినా.. కుటుంబ సభ్యుల్లో ఒకరు వస్తున్న భావన ప్రజల నిరీక్షణతో ప్రస్పుటమైంది. అక్కాచెల్లెళ్లు.. అన్నాతమ్ముళ్లు.. అవ్వాతాతలు.. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల వెంట బారులుతీరి స్వాగతించడం ‘రేపటి ప్రభంజనానికి’ అద్దం పట్టింది.
సాక్షి, కర్నూలు : ముఖంలో చిరునవ్వు.. మాటల్లో ఆప్యాయత.. భవితకు భరోసా.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్నంత సేపు ఎర్రని ఎండలోనూ అభిమానులు కట్టుకదలకపోవడం విశేషం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమవారం కర్నూలు, నంద్యాలలో పర్యటించారు. రోడ్‌షోలు నిర్వహించి జనభేరి సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘మిట్ట మధ్యాహ్నం దాటింది. ఎండ మండిపోతున్నా ఖాతరు చేయడం లేదు. పర్యటన అనుకున్న సమయం కన్నా దాదాపు మూడు గంటలు ఆలస్యమైనా ఏ ఒక్కరి ముఖంలోనూ చిరాకు కనిపించడం లేదు.
ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కారణాలు వెతుక్కోలేదు. వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయత, ప్రేమానురాగాలు చూపుతున్న ప్రతి అక్కకు.. ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి అమ్మకు.. ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితునికీ చేతులు జోడించి.. పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ జగన్ మాట్లాడిన తీరు గుండెలకు హత్తుకుంది.
మధ్యాహ్నం 11.30 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్‌ఏపీ క్యాంప్ వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్న జననేత ఓపెన్‌టాప్ బస్సులో కొండారెడ్డి బురుజు వద్దనున్న పాత బస్టాండ్ వరకు రోడ్‌షో నిర్వహించారు. అప్పటికే అక్కడ వేలాదిగా చేరుకున్న ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ చంద్రబాబునాయుడు ఆల్‌ఫ్రీ హామీల తీరుతెన్నులను ఎండగట్టారు. తాను విశ్వసనీయ రాజకీయాలే చేస్తానని స్పష్టం చేశారు. ఓట్ల కోసం.. సీట్ల కోసమే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ నాయకులు, చంద్రబాబు కలసికట్టుగా బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘నా పక్కన ఎస్వీ మోహన్‌రెడ్డి ఉన్నాడు. మంచివాడు.. అందరికీ అందుబాటులో ఉంటాడు. ప్రజా సేవ చేయడానికి ఉత్సాహంతో ఉన్నాడు. మనస్ఫూర్తిగా దీవించండని సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఇక నా కుడి పక్కన రేణుకమ్మ ఉన్నారు. నాకు అక్కలాంటిది. మంచి వారు.. మీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ చల్లటి ఆశీస్సులు ఇవ్వండి.. ఆదరించండి. మీ ఆప్యాయతలు చూపించాల్సిందిగా పేరుపేరునా చేతులు జోడించి కోరుతున్నాను. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న వీరిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించండి’’ అని అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసే వారు చేతులెత్తమని జగన్ అడగడంతో అక్కడున్న వారంతా చేతులెత్తి మద్దతుపలికారు.
అనంతరం హెలికాప్టర్‌లోనే మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో నంద్యాలకు చేరుకున్నారు. ఇక్కడ పర్యటన దాదాపు రెండున్నర గంటలు ఆలస్యమైనా ప్రజలు కట్టుకదలకపోవడం విశేషం. రోడ్‌షో నిర్వహిస్తూ పొట్టిశ్రీరాములు సర్కిల్‌కు చేరుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడి బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిలను గెలిపించాలని కోరారు. ‘నాకు అక్క లేదు... శోభమ్మలో అక్కను చూసుకున్నా. కానీ ఆమె లేదన్న వాస్తవం నన్ను కలచివేస్తోంది.
భారీ మెజార్టీతో గెలిపించడమే ఆమెకు ఘనమైన నివాళి’ అని జగన్ అంటున్నప్పుడు ప్రజలు ఉవ్వెత్తున ఉద్వేగంతో స్పందించారు. శోభా నాగిరెడ్డి గురించి జగన్ మాట్లాడుతున్నంత సేపు ప్రజలు భూమా నాగిరెడ్డివైపే చూస్తుండటంతో ఆయన భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. జనభేరి సభల్లో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, మార్కెట్‌యార్డు చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, ఎన్.హెచ్.భాస్కర్‌రెడ్డి, డాక్టర్ నౌమాన్, రాజగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.