కె.మనోరమ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి
సాక్షి, కంచిలి/ ఇచ్ఛాపురం రూరల్/ కవిటి/ ఇచ్ఛాపురం/ సోంపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న జనాదరణ చూసి తట్టుకోలేని టీడీపీ నాయకులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. టీడీపీ కంచుకోటైన ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఓడిపోతామనే భయంతో నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆన్‌లైన్ ఫారం–7తో ఓట్ల తొలగింపుకు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకుల పేర్లతో దరఖాస్తులు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఫారం–7 ద్వారా ఓట్లు తొలగించాలని సుమారు 8740 దరఖాస్తులు వచ్చాయని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను ఆ పార్టీ నేతలే తొలగించాలని కోరుతున్నట్టు పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌లో ఫారం–7 దరఖాస్తు చేయడం జరిగింది. దీంతో గ్రామస్థాయిలో ఆయా పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య పొరపచ్చాలు వచ్చి తగవులు పడేవిధంగా కుట్రలు పన్నేందుకు ఇటువంటి పన్నాగం పన్నినట్టు భావిస్తున్నారు.
ఇచ్ఛాపురం నియోజకర్గం పరిధిలో మొత్తంగా నాలుగు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించాల్సిందిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు రావడంతో ఎన్నికల అధికారులు విస్మయం చెందారు. దొంగ అడ్రస్‌లతో ఒకరి బదులు వేరొకరి ఇలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతో అధికారులు ఆయా దరఖాస్తుదారులను విచారించడానికి పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉండగా కంచిలి తహసీల్దార్ బి.టి.శ్రీనివాస్‌ను స్థానిక ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డి.ధర్మారావు, రుషి, దీనబందు, జోగారావులు శనివారం కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
తమ ప్రమేయం లేకుండా తమ పేర్లు పెట్టి ఓట్లు తొలగించాల్సిందిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారని, అటువంటి దొంగపని చేసిన వారిని కనిపెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో అ«ధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ఆయా దరఖాస్తులను ఫ్రోసెస్ చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఈ విధమైన కుట్రలకు పాల్పడడంతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, న్యూట్రల్ ఓటర్లు ఇటువంటి చర్యలకు పాల్పడినవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.
ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు
టీడీపీ వారు ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపునకు పూనుకున్నారు. మండపలి పంచాయతీలో ఓట్లు తొలగించాలంటూ నాపేరుపై దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఉండడంతో ఆశ్చర్యపోయాను. దీనిపై అధికారులు విచారణ చేపట్టాలి. వైఎస్సార్ ఓటర్లను తొలగించేందుకు అధికార పార్టీ పెద్ద కుట్ర చేస్తోంది.
పిట్ట మామయ్య, వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఇచ్ఛాపురం మండలం
వెంటనే చర్యలు తీసుకోవాలి
పల్స్ సర్వే సమయంలో సేకరించిన బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. ఓట్ల తొలగింపు ప్రధాన లక్ష్యంగా ఈ డేటాను వాడుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో టీడీపీ ఉలిక్కిపడుతోంది. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
కారంగి మోహనరావు, మాజీ ఎంపీపీ, ఇచ్ఛాపురం
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆన్‌లైన్ ఫారం–7 లో 8,740 ఓట్లు తొలగింపునకు దరఖాస్తులు వచ్చాయి. వీటిని స్థానిక బూత్ లెవల్ అధికారుల(బీఎల్‌వో)చే ధర్యాప్తు, తనిఖీ చేయిస్తున్నాం. అక్రమాలకు పాల్పడినవారిపై తగిన చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment