సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబ నికర ఆస్తులు రూ.102.48 కోట్లు అని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే తమ నికర ఆస్తులు రూ.13.82 కోట్లు పెరిగాయని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వారి కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. చంద్రబాబు పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ.9 కోట్లు కాగా ఆయన పేరున రూ.5.13 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు.
అంటే చంద్రబాబు పేరిట నికర ఆస్తులు రూ.3.87 కోట్లని, గత ఏడాదితో పోలిస్తే రూ.87 లక్షల నికర ఆస్తులు పెరిగాయని తెలిపారు. ఆయన పేరిట బ్యాంకు రుణం రూ.18 లక్షలు తగ్గిందన్నారు. చంద్రబాబు సతీమణి, తన మాతృమూర్తి భువనేశ్వరి పేరిట మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు, అప్పులు రూ.11.04 కోట్లు ఉన్నట్టు లోకేశ్ వెల్లడించారు. ఆమె పేరిట రూ.39.58 కోట్ల నికర ఆస్తి ఉన్నట్టు చెబుతూ.. గత ఏడాదితో పోలిస్తే నికర ఆస్తులు రూ.8.50 కోట్లు పెరిగాయన్నారు.
నా పేరుపై రూ.19 కోట్ల నికర ఆస్తులు
తన పేరిట మొత్తం రూ.24.70 కోట్ల ఆస్తులు, రూ.5.70 కోట్ల అప్పులు ఉన్నట్టు లోకేశ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే నికర ఆస్తులు రూ.2.40 కోట్లు తగ్గి, ప్రస్తుతం తనకు రూ.19 కోట్లు నికర ఆస్తులు ఉన్నాయన్నారు. తన భార్య బ్రాహ్మణి ఆస్తులు రూ.15.68 కోట్లు, అప్పులు రూ.4.17 కోట్లు ఉన్నట్టుగా లోకేశ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఆమె పేరిట నికర ఆస్తులు రూ.3.80 కోట్లు పెరిగి ప్రస్తుతం మొత్తం నికర ఆస్తులు రూ.11.51 కోట్లు ఉన్నట్టుగా వివరించారు. తన కుమారుడు దేవాన్ష్ పేరిట రూ.19.42 కోట్ల ఆస్తులు ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే రూ.3.80 కోట్లు పెరిగిందన్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు తన వాటాలోని 26,440 షేర్లను మనవడు దేవాన్ష్‌కు బహుమతిగా ఇచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ నిర్వాణ హోల్డింగ్స్ అప్పులు రూ.37.20 కోట్ల నుంచి రూ.34.85 కోట్లకు తగ్గినట్టు లోకేశ్ వెల్లడించారు. ఆ సంస్థ నికర ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.2.27 కోట్లు పెరిగి, రూ.9.10 కోట్లకు చేరాయన్నారు.
ఐటీ అధికారులే లెక్కలు తేలుస్తారు
ఇటీవల జరిగిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారుల దాడుల్లో గుర్తించిన ఆస్తుల లెక్కలను ఆ శాఖ అధికారులే తేలుస్తారని నారా లోకేశ్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఐటీ దాడులు జరిగినా చంద్రబాబుకే అంటగడుతున్నారని ఆయన విమర్శించారు. తాము చెప్పిన దానికంటే ఒక్క షేర్ ఎక్కువ ఉన్నా మొత్తం ఆస్తి రాసిస్తామన్నారు. మీడియా ముందుకు వచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ జంకుతున్నారని, అందుకే 9 నెలల్లో ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదన్నారు. చంద్రబాబుకు ముప్పు ఉందని తెలిసినా భద్రత తగ్గించారని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment