బీసీలను కించపర్చిన మంత్రి లోకేశ్‌ | Nara lokesh Follows his dather chandrababu's way, says ysrcp leader pardhasarathi | Sakshi
Sakshi News home page

బీసీలను కించపర్చిన మంత్రి లోకేశ్‌

Published Sun, Jul 16 2017 3:02 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

బీసీలను కించపర్చిన మంత్రి లోకేశ్‌ - Sakshi

బీసీలను కించపర్చిన మంత్రి లోకేశ్‌

వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్థసారథి ధ్వజం 
 
సాక్షి, హైదరాబాద్‌:  బలహీన వర్గాలకు సీటు ఇస్తే గెలవగలరా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ బీసీలను కించపరిచేలా మాట్లాడారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. బలహీనవర్గాలను కించపర్చిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాయలసీమలో ఐదు లక్షల ఉద్యోగాలిచ్చామంటూ చంద్రబాబు, నారా లోకేశ్‌ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని కోరితే అభివృద్ధి నిరోధక పార్టీ అంటూ వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లోకేశ్‌బాబు కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నారని పార్థసారథి విమర్శించారు.

ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘రాయలసీమకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్టు చూపించు.. అని కర్నూలు జిల్లాలో మంత్రి లోకేశ్‌ను యువకులు నిలదీస్తే ఆయన సమాధానం చెప్పలేకపోయారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరితే రేయ్‌ ఉండ్రా అంటూ దౌర్జన్యం చేశారు. బలహీనవర్గాలకు సీటు ఇస్తే గెలవగలరా? అంటూ లోకేశ్‌ బీసీలను అవమానించేలా మాట్లాడారు. బలహీన వర్గాలు ఏమీ చేయలేరు, రాజకీయాలు చేతకాదన్న అభిప్రాయంతోనే ఓడిపోయే సీట్లను టీడీపీ బలహీన వర్గాలకు కేటాయిస్తోంది. బలహీనవర్గాలను కించపర్చిన టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సీఎం బాబు రైతుల సమస్యలను పట్టించుకోకుండా నంద్యాల ఉపఎన్నికల్లో ఈవెంట్‌ మేనేజర్‌గా మారాడు. చంద్రబాబు ఎక్కడా అభివృద్ధి చేయడు, చేస్తున్నట్టు ఎన్నికల్లో నటిస్తాడని టీడీపీ నేతలే చెబుతున్నారు.

ఎన్నికలున్నాయనే నంద్యాలకు రూ.300 కోట్లు నిధులు విడుదల చేస్తూ జీవోలిచ్చారు. అవి అమలు కావని అందరికీ తెలుసు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే. పట్టిసీమ నుంచి నీళ్లు ఇచ్చామన్నారు. కృష్ణా డెల్టాలో పిల్ల కాలువలకు నీళ్లందే పరిస్థితి లేక రైతులు మోటార్లతో నీళ్లు తోడుకుంటున్నారు. రాయలసీమకు నీళ్లిచ్చామంటూ హడావుడి చేసి గడ్డాలు, గుండు గీయించుకున్నారే తప్ప ఎక్కడా నీళ్లిచ్చిన పాపాన పోలేదు.’’అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement