రాయపాటి చూపు.. నరసరావుపేట వైపు...?
రాయపాటి చూపు.. నరసరావుపేట వైపు...?
Published Thu, Mar 13 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
అరండల్‌పేట(గుంటూరు),న్యూస్‌లైన్: గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు జిల్లాలో పరిచయం అవసరం లేని రాజకీయ నేత. ఒకసారి రాజ్యసభ సభ్యునిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నాయకుడిగా చలామణి అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.యూపీఏ ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డితో సన్నిహితంగా మెలగడంతో ఆయన ఏర్పాటు చేసే కొత్త పార్టీలో చేరతారని అంతా భావించారు. అయితే సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఒత్తిడితో ఆయన కిరణ్ పార్టీలో చేరలేదు. చివరగా, తెలుగుదేశం పార్టీలో చేరాలని రాయపాటి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వాస్తవానికి గుంటూరు పార్లమెంటు టికెట్‌ను రాయపాటి సాంబశివరావుకి ఇవ్వాలని తొలుత తెలుగుదేశం పార్టీ సైతం ఆలోచించింది. అయితే రాయపాటి పార్టీలో చేరేందుకు కాలయాపన చేయడం, ఆ లోపు మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబ సభ్యులు పార్టీలోకి వస్తే గుంటూరు పార్లమెంటు టికెట్ కేటాయించాలని కోరడం అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించడం చకచకా జరిగిపోయాయి.నరసరావుపేట వైపు చూపు... తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రాయపాటి సాంబశివరావు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా గల్లా జయదేవ్‌ను ప్రకటించడంతో నరసరావుపేట సీటు కేటాయించాలని కోరినట్లు సమాచారం. అయితే అక్కడ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ రాయపాటి తన ప్రయత్నాలను మమ్మురం చేసినట్లు సమాచారం. ఈ నెలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గుంటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ సభ తరువాత నరసరావుపేట పార్లమెంటు టికెట్ కేటాయింపు అంశం ఒక కొలిక్కి రావచ్చని జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో నరసరావుపేట టికెట్ ఇవ్వకుంటే కనీసం కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు పశ్చిమ నుంచి ఎంపీ మోదుగుల ... ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక్కడి నుంచి మోదుగుల పోటీ చేయకుంటే రాయపాటి సోదరుని కుమారుడు మాజీ మేయర్ రాయపాటి మోహనసాయికృష్ణకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన తెలుగుదేశం అధిష్టానం వద్ద రాయపాటి ఉంచినట్లు సమాచారం. ఏదిఏమైనా 2014 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతూ వ్యూహాల్లో బిజీబిజీగా గడపాల్సిన రాయపాటి రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది మరి కొద్దిరోజుల్లో తేలనుంది.
Advertisement