అతను చదువులో ఎంతో ముందుండేవాడు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా చదివేవాడు. టెన్త్‌లో పదికి పది పాయింట్లు సాధించాడు. ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రతిభ చూపాడు. కానీ నారాయణ కాలేజీ యాజమాన్యం కాఠిన్యం కారణంగా ఉరేసుకుని అర్ధంతరంగా తనువు చాలించాడు. తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చాడు.
కర్నూలు, వెల్దుర్తి: మండలంలోని రామళ్లకోటకు చెందిన ఆత్మకూరు రఘురామిరెడ్డి, ఆదినారాయణమ్మ(శ్రీదేవి) దంపతుల కుమారుడు శ్రీచరణ్ శుక్రవారం సాయంత్రం విజయవాడలోని కంకిపాడు నారాయణ క్యాంపస్ హాస్టల్ గదిలో బాత్‌రూం కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రఘురామిరెడ్డి, ఆదినారాయణమ్మ దంపతులకు కుమారుడు చరణ్‌తో పాటు కుమార్తె ప్రియాంక ఉన్నారు. గ్రామంలోని కాల్వబుగ్గరోడ్డులో నివాసముండే రఘురామిరెడ్డి వ్యవసాయదారుడు.
పిల్లల చదువు కోసం పదేళ్ల క్రితం నుంచి డోన్ పట్టణంలోని రాజా టాకీస్ పక్కన నివాసముంటున్నాడు. ప్రతిరోజు స్వగ్రామానికి వచ్చి పొలం పనులు చూసుకుంటుంటాడు. ప్రియాంక ప్రస్తుతం కర్నూలులో డీఎడ్ చదువుతోంది. శ్రీచరణ్ పదో తరగతి డోన్‌లోని శ్రీసుధ స్కూల్‌లో చదివి 10కి 10 పాయింట్లు సాధించాడు. ఇంటర్మీడియట్ విజయవాడలోని నారాయణ కాలేజీలో ఎంపీసీ గ్రూప్‌లో చేర్పించారు. ఫస్టియర్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్నాడు. ఇటీవల దసరా సెలవులకు వచ్చి తన చిన్ననాటి మిత్రులు, బంధువులతో కలిసి సరదాగా గడిపి వెళ్లాడు. అయితే.. శుక్రవారం జ్వరంతో రావడంతో ఇంటికి వెళతానని కాలేజీ నిర్వాహకులను కోరాడు. వారు ససేమిరా అనడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు నిర్ఘాంతపోయారు.
సరైన సమాచారం ఇవ్వనికాలేజీ యాజమాన్యం
శ్రీచరణ్ కాలేజీ విడిచిన తర్వాత హాస్టల్‌కు వెళ్లి తన గదిలో ఉరివేసుకుని అస్వస్థతకు గురయ్యాడని కాలేజీ యాజమాన్యం తమకు సమాచారమిచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కామినేని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించామని చెప్పారన్నారు. అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో శ్రీచరణ్ చనిపోయినట్లు వార్తలు రావడంతో వారు కామినేని ఆస్పత్రికి ఫోన్ చేశారు. అతను చనిపోయినట్లు నిర్ధారించడంతో విజయవాడ బయలుదేరివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment