ఆవేశంతోనే తమ్మినేనిపై ఆరోపణలు
ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా: నారాయణ
వాటిని వెనక్కి తీసుకుంటున్నానంటూ రాఘవులుకు లేఖ
సాక్షి, హైదరాబాద్: తనను ఓడించేందుకు డబ్బు తీసుకున్నారంటూ.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విచారం వ్యక్తం చేశారు. తాను ఆవేశంతో ఆ వ్యాఖ్యలు చేశానని, వాటిని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. ఈ మేరకు నారాయణ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుకు సోమవారం లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న ప్రకారం.. ‘‘నా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ మీరు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి గారికి ఉత్తరం రాశారు. దాని ప్రతి నాకు పంపారు. అయితే సమస్యను కేంద్రానికి నివేదించినందున నేను సకాలంలో బదులివ్వలేదు. కేంద్ర పార్టీ ఆదేశం మేరకు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు వైఎస్సార్‌సీపీతో రాష్ట్రవ్యాప్తంగా లేదా తెలంగాణ ప్రాంతమంతా ఎన్నికల అవగాహన పెట్టుకుని ఉంటే మేం తప్పుబట్టే వాళ్లం కాదు. నేను పోటీ చేసిన ఖమ్మం లోక్‌సభ స్థానం వరకే మీరు వైఎస్సార్‌సీపీతో అవగాహన పెట్టుకున్నారు. దీంతో అపోహలు ఏర్పడ్డాయి. మీ పార్టీ ఎన్నికల ప్రచారం వరకు పరిమితం కాకుండా అంతకు మించి వ్యవహరించిందని భావించాం. కాబట్టి ఆవేశంతో వీరభద్రంపై అలాంటి వ్యాఖ్యలు (వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పి.శ్రీనివాసరెడ్డి నుంచి 15 కోట్లు తీసుకున్నట్టుగా ప్రజలు చెప్పుకుంటున్నారని) చేశాను. అయితే ఇలాంటి ఆరోపణలకు, ప్రత్యారోపణలకు నిరూపణలు ఉండవు. బాధ్యత కలిగిన నేను అలా నిరూపించలేని అంశాలతో కామెంట్ చేసినందుకు విచారిస్తున్నాను. వాటిని ఉపసంహరించుకుంటున్నాను. నా మూలంగా వామపక్ష ఐక్యతకు ఎలాంటి నష్టం జరగకూడదని అభిప్రాయపడుతున్నాను..’’ అని నారాయణ లేఖలో పేర్కొన్నాను.