శస్త్రచికిత్స అనంతరం వెంకటసుబ్బమ్మతో వైద్యులు
నెల్లూరు(బారకాసు): ఓ మహిళ మెదడులో ఉన్న 1.2 కేజీల కణితను నారాయణ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. మంగళవారం చింతారెడ్డిపాళెంలోని నారాయణ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు జి.విద్యాసాగర్ వివరాలు వెల్లడించారు. కావలిలోని బీసీ కాలనీకి చెందిన 65 ఏళ్ల వెంకటసుబ్బమ్మ చాలా రోజులుగా మెదడులోని కణిత కారణంగా మూతి వంకరపోయి తరచూ ఫిట్స్ రావడంతో ఇబ్బందిపడుతుండేది. పలు హాస్పిటల్స్‌లో వైద్యం చేయించినా ఫలితం లేకుండాపోయింది. సన్నిహితురాలి సూచన మేరకు ఆమె నారాయణ హాస్పిటల్‌కు వచ్చారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడులో పెద్ద కణిత ఉందని, దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని తెలిపారు.
కుటుంబసభ్యుల అంగీకారం మేరకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కణితను తొలగించారు. ఈ కణిత 1.2 కేజీల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ హాస్పిటల్‌లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాణుతులైన వైద్యులు అందుబాటులో ఉండటం వల్లనే ఈక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాంసతీష్ తెలిపారు. ఈ శస్త్రచికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఉచితంగా నిర్వహించామన్నారు. సమావేశంలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ విజయమోహన్‌రెడ్డి, ఏజీఎం భాస్కర్‌రెడ్డి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment