Tumor removal
-
లంగర్‌హౌస్: మహిళ కడుపులో 3 కిలోల కణితి..
సాక్షి, లంగర్‌హౌస్: ఓ మహిళ గర్భాశయం నుంచి 3 కిలోల కణితిని లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆస్పత్రి వైద్యులు విజయంవంతంగా తొలగించారు. ఏపీలోని గుంటూరుకు చెందిన మహిళ 15 సంవత్సరాల క్రితం గర్భాశయ ముఖం ద్వారా క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు. అయితే కొంత కాలంగా ఆమెకు కడుపులో తీవ్రమైన నొప్పి, కడుపు ఉబ్బడం, వెన్నెముక నొప్పి తదితర కారణాలతో బాధపడుతోంది. దీంతో బంధువులు ఆమెను లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భాశయంలో పెద్ద కణితి ఉందని చెప్పారు. అనంతరం వైద్యులు డాక్టర్ రాజాశ్రీ, ఆంకో సర్జన్ డాక్టర్ సంజయ్‌ల ఆమెకు విజయవంతంగా సర్జరీ చేసి మూడు కిలోల బరువున్న కణితిని తొలగించారు. కాగా గర్భాశయంతో పాటు కణజాలంలో వ్యాపించిన ట్యూమర్ అవశేషాలను కూడా తొలగించామని వైద్యులు తెలిపారు. ఎటువంటి పోస్టు ఆపరేటివ్ ఇబ్బందులు లేకుండా పేషెంట్ పూర్తిగా కోలుకున్నారని, ఆమెను డిశ్చార్చి చేశామని వైద్యులు తెలిపారు. -
విద్యార్థిని కడపులో కేజీ కణితి!
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం): ఓ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సమయస్ఫూర్తితో ఓ విద్యార్థి ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన విద్యార్థి ప్రాణానికే ముప్పు వాటిల్లేది. వివరాలిలా.. మండలంలోని దబ్బతోగు గ్రామానికి చెందిన మల్లం లక్ష్మి అనే విద్యార్థిని బీమునిగూడెం ఐటీడీఏ బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కాగా నెల రోజుల క్రితం ప్రత్యేక కోచింగ్‌లో భాగంగా అశ్వారావుపేట మండలంలోని అనంతారం గ్రామంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరగా, అనాటి నుంచి ఇక్కడే చదువుతుంది. ఈ క్రమంలోనే గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి రాగా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాఠశాల హెచ్ఎం అజ్మీర కృష్ణకుమారి తక్షణమే స్పందించి తన కారులోనే గుమ్మడవల్లి ప్రభుత్వ వైద్యాశాలకు తరలించి వైద్యం చేయించారు. ఐనా సరే కడుపు నొప్పి తీవ్రత తగ్గకపోవడంతో అశ్వారావుపేట వైద్యాశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దాంతో హుటాహుటిన సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే శస్త్ర చికిత్స చేసి తొలగించకపోతే కణితి పగిలిపోయి ప్రాణాపాయం కలుగుతుందని చెప్పారు. దీంతో హెచ్ఎం స్పందించి అన్నీ తానే అయి శస్త్ర చికిత్స చేయించారు. దీంతో తెల్లవారు జామున శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో నుంచి కేజీ బరువు ఉన్న కణితిని తొలగించారు. అనంతరం విద్యార్థిని ప్రాణపాయం తప్పి ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హెచ్ఎం సమయస్ఫూర్తి, సకాలంలో స్పందించడం వల్లే శస్త్రచికిత్స చేసి విద్యార్థిని ప్రాణాలు కాపాడగలిగినట్లు వైద్యులు పేర్కొన్నారు. -
మహిళ కడుపులో ఏడు కిలోల కణతి..
తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. మహిళ కడుపులోని ఏడు కిలోల కణితిని మంగళవారం తొలగించారు. వైద్యులు కథనం ప్రకారం... చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన టి.ఝాన్సీ(28) మూడు సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బాధపడుతూ ఉంది. అనేక వైద్యశాలలో చికిత్స పొందిన పూర్తిస్థాయిలో నొప్పి తగ్గలేదు. దీంతో ఆమె మూడు రోజుల కిందట తెనాలి జిల్లా వైద్యశాలకు చికిత్స నిమిత్తం వచ్చారు. ఆమెకు అన్ని పరీక్షలు చేయగా కడుపులో కణితి ఉన్నట్లు నిర్ధారించారు. వైద్యశాల సూపరింటెండెంట్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం.సనత్‌కుమారి నేతృత్వంలో ఏడు కిలోల కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం మహిళ క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
మహిళ కడుపులో ఐదు కిలోల కణితి
సాక్షి, గజ్వేల్: కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ కడుపులో నుంచి వైద్యుల బృందం 5కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. గురువారం ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో దాదాపు 3 గంటల పాటు శస్త్రచికిత్స జరిపి కణితిని తొలగించారు. ఆర్వీఎం వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చెల్ జిల్లా మండల కేంద్రమైన ఏదులాబాద్ గ్రామానికి చెందిన మండీ లక్ష్మయ్య భార్య సువర్ణ గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇటీవల చికిత్స నిమిత్తం ఆమె ఆర్వీఎం ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆర్వీఎం ఆసుపత్రి వైద్యనిపుణులు ఆమె కడుపులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వైద్య నిపుణులు డాక్టర్.మంజుల, డాక్టర్.స్వాతి, డాక్టర్.కవితలతో పాటు మత్తు డాక్టర్లు రవీందర్, విజయ్, వంశీ ఇతర వైద్య సిబ్బందితో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స చేశారు. మూడు గంటల పాటు శ్రమించి ఆ మహిళ కడుపులోనుంచి 5 కిలోలకు పైగా బరువుగల పెద్ద కణితిని తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబీకులు, గ్రామస్తులు ఆర్వీఎం ఆసుపత్రి బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. శస్త్రచికిత్స సఫలం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. రోగి పూర్తిగా కోలుకుంటుందని వైద్యుల బృందం పేర్కొంది. -
మెదడులోని 1.2 కేజీల కణిత తొలగింపు
నెల్లూరు(బారకాసు): ఓ మహిళ మెదడులో ఉన్న 1.2 కేజీల కణితను నారాయణ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. మంగళవారం చింతారెడ్డిపాళెంలోని నారాయణ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు జి.విద్యాసాగర్ వివరాలు వెల్లడించారు. కావలిలోని బీసీ కాలనీకి చెందిన 65 ఏళ్ల వెంకటసుబ్బమ్మ చాలా రోజులుగా మెదడులోని కణిత కారణంగా మూతి వంకరపోయి తరచూ ఫిట్స్ రావడంతో ఇబ్బందిపడుతుండేది. పలు హాస్పిటల్స్‌లో వైద్యం చేయించినా ఫలితం లేకుండాపోయింది. సన్నిహితురాలి సూచన మేరకు ఆమె నారాయణ హాస్పిటల్‌కు వచ్చారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడులో పెద్ద కణిత ఉందని, దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని తెలిపారు. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కణితను తొలగించారు. ఈ కణిత 1.2 కేజీల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాణుతులైన వైద్యులు అందుబాటులో ఉండటం వల్లనే ఈక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాంసతీష్ తెలిపారు. ఈ శస్త్రచికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఉచితంగా నిర్వహించామన్నారు. సమావేశంలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ విజయమోహన్‌రెడ్డి, ఏజీఎం భాస్కర్‌రెడ్డి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. మహిళ చెవి పక్కన పెరుగుతున్న ఆరుకిలోల బరువుగల కణితిని విజయవంతంగా తొలగిం చారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పేరినసింగారం గ్రామానికి చెందిన నాగమ్మ (56) ఎడమచెవికి ఆనుకుని పెరుగుతన్న కణితితో 20 ఏళ్లుగా బాధపడుతోంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. స్థానిక వైద్యుల సూచన మేరకు ఈనెల 12న గాంధీ ఆస్పత్రికి వచ్చింది. వైద్యపరీక్షలు నిర్వహించి ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని సర్జరీ వైద్యుడు ఆర్. రఘు ఆధ్వర్యంలో సోమవారం సుమారు రెండున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. దీనిని పేరోటిడ్ ట్యూమర్ అంటారని, 25 ఏళ్ల క్రితం శస్త్రచికిత్స చేసి ట్యూమర్‌ను తొలగించినా మళ్లీ పెరిగిందని డాక్టర్ రఘు తెలిపారు. రెండోసారి ఆపరేషన్ ప్రమాదంతో కూడుకున్నదైనప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. నాగమ్మ కోలుకుంటుందన్నారు. లక్షలాది రూపాయల వ్యయం అయ్యే అరుదైన ఆపరేషన్‌ను గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించామన్నారు. ఆపరేషన్ నిర్వహించిన వైద్యు లు ఆర్.రఘు, ఎల్.రమేష్, బాలాజీ, హరినాథ్, జ్యోతి, పీజీలు సురయ్య, రవీందర్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.ఎస్.అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ శ్రీలత అభినందించారు.