నెల్లూరులో నారాయణకు చేదు అనుభవం
సమైక్య ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ కార్యక్రమం నిమిత్తం నెల్లూరు వచ్చిన నారాయణను అక్కడ సమైక్యరాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న ఎన్జీవో నాయకులు అడ్డుకున్నారు.
సమైక్యవాదాన్ని బలపర్చాలని ఆయనను డిమాండ్ చేశారు. అయితే, ఇంతలో పోలీసులు వచ్చి, సమైక్యవాదులను అడ్డుకుని అక్కడినుంచి తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉండటంతో, దానిపై పార్టీ వర్గాలతో చర్చించేందుకు నారాయణ నెల్లూరు వచ్చారు. దాంతోపాటు స్థానికంగా పార్టీ పరిస్థితిపై కూడా చర్చించారు.