నీవు లేక నీ జ్ఞాపకాలే తోడుగా.. | Narayana Reddy Brutally Murdered By Rivals | Sakshi
Sakshi News home page

నీవు లేక నీ జ్ఞాపకాలే తోడుగా..

Published Mon, May 22 2017 4:52 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

నీవు లేక నీ జ్ఞాపకాలే తోడుగా.. - Sakshi

నీవు లేక నీ జ్ఞాపకాలే తోడుగా..

ప్రజాదరణ నేతగా ఎదిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి
కష్టాలను ఎదురీదుతూ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తూ
కుట్రలను ఛేదిస్తూ.. ప్రత్యర్థులను అధిగమిస్తూ..
కొండంత అండను కోల్పోయిన పత్తికొండ


చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రజానేత. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం తపించే నాయకుడు. పత్తికొండ నియోజకవర్గంలో మంచికి మారుపేరుగా ప్రజల మనసు చూరగొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెళ్లేవారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేవారు. అధికార పార్టీ నేతల అక్రమాలను నిలదేసేవారు. ఇటీవల తాగు నీటి సమస్య పరిష్కారం కోసం ప్రజల తో కలిసి భారీ ధర్నా కూడా నిర్వహించారు.

ప్రజాక్షేత్రంతో దూసుకుపోతున్న నారాయణ రెడ్డికి అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ నాయకులు ఎన్నో ఎత్తుగడలు పన్నారు. ఆయన వర్గీయులను బెదిరింపు  లకు గురిచేశారు. పలువురిపై దాడులు కూడా చేశారు. అయినా బెదరక.. కార్యకర్తలకు, తన వర్గీయులకు చెరుకులపాడు అండగా నిలబడ్డారు. ప్రజల కోసం..వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌకర్యాల కోసం పోరాడారు. దీంతో ప్రత్యర్థి శిబిరంలో వణుకు పుట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే భయంతో అతన్ని హతమార్చేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు.

కాపుకాసి..బాంబులు వేసి..వేటకొడవళ్లలో ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో వెల్దుర్తి మండం కృష్ణగిరి వద్ద దారుణంగా నరికి హతమార్చారు. దారుణ హత్యలో టీడీపీకి చెందిన కీలక నేత హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, సోమవారం జిల్లా బంద్‌కు పార్టీ నేతలు పిలుపునిచ్చారు.


కర్నూలు(అర్బన్‌): అధికార పార్టీ ఆది నుంచి చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ... అవసరమైతే అంతమొందించేందుకు అనేక రూపాల్లో కుట్రలు పన్నుతూనే వచ్చింది. అయినా ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడకుండా, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలంటు ... పత్తికొండ ప్రజలకు అండగా నిలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దివాళా తీసిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 32 వేల ఓట్లను సాధించారంటే ... ప్రజల్లో ఆయనకున్న అభిమానం ఎలాంటిదో తెలుస్తోంది. అతి చిన్న వయస్సులోనే తండ్రి శివారెడ్డి హత్యతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారాయణరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉంటు పత్తికొండ, డోన్, పాణ్యం నియోజకవర్గాల్లోని అభ్యర్థుల విజయావకాశాలను శాసించే స్థాయికి ఎదిగారు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ నాటి నుంచే నారాయణరెడ్డిని ఎదో ఒక విధంగా దెబ్బ తీయాలని చూస్తూనే వచ్చింది.  

పత్తికొండ అభివృద్ధికి అహర్నిషలు కృషి...
అధికారం ఉన్నా, లేకపోయినా పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి చెరుకులపాడు ఎంతో కృషి చేశారు. పత్తికొండ మండల పరిధిలోని దేవనబండ, జూటూరు, మందగిరి, పులికొండ, చక్రాళ్ల, చందోలి తదితర గ్రామాల్లో తాగునీటి బోర్ల ఏర్పాటు చేయించారు. అలాగే పత్తికొండలోని కటికేవీధిలోని ముస్లింల శ్మశాన వాటిక ప్రహరీ, సిమెంట్‌ రోడ్డు నిర్మాణం నారాయణ రెడ్డి చొరవతో పూర్తయింది. యువతకు జాబ్‌మేళాతో 20 మంది యువకులకు ఉపాధి అవకాశాలతో పాటు, పేదలకు వైద్యసాయం అందించేందుకు సహకారం అందించారు.

 మద్దికెర మండలంలో సుమారు రూ.2కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారు. కొత్తపల్లి మద్దికెరకు రూ.98 లక్షలతో రోడ్డు నిర్మాణం, మద్దికెరలోని నేసే వీధిలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు ఏర్పాటు చేయించారు. అలాగే పెరవలి, మద్దికెర గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఎంపీ బుట్టారేణుక సహకారంతో యశ్వంత్‌పూర్‌–కాచిగూడా రైలు మద్దికెరలో నిలిపేందుకు కృషి చేశారు. ఆపదలో ఉన్న వారికి వైద్య సాయం, ఎర్రగుడి, తుగ్గలి, జొన్నగిరి, పెండేకల్, రాంపురం గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు.

ఒకే రోజు 27 శుభకార్యాలకు హాజరు
తనకు పరిచయం ఉన్న ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా, తప్పక హాజరయ్యే మనస్థత్వం నారాయణరెడ్డిది. ఒకానొక సందర్భంలో ఒకే రోజు 27 శుభ కార్యాలకు హాజరైన నారాయణరెడ్డిని చూసి‡ వైఎస్సార్‌సీపీ నేతలే విస్తు పోయారు. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా పల్లె ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తు, ఎంతో ఆత్మీయతను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాలకు చెందిన వారు ఎవరు అనారోగ్యాలకు గురై కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్సకు చేరినా, వారికి నేనున్నాంటు భరోసా ఇస్తు ఆయా ఆసుపత్రుల యాజమాన్యలతో మాట్లాడి ఫీజులు తగ్గిస్తు మెరుగైన వైద్యం చేయించేందుకు కృషి చేస్తు వచ్చారు.

చెరుకులపాడు శ్రీమంతుడు
కర్నూలు (అర్బన్‌): ముఠాకక్షల ఖిల్లాగా ముద్రపడిన చెరుకులపాడు గ్రామాభివృద్ధికి నారాయణరెడ్డి ఎంతో కృషి చేశారు. 1995లో నారాయణరెడ్డి తండ్రి శివారెడ్డిపేరుతో స్మారక సంస్థను ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్నత పాఠశాలను నిర్మించారు. అప్పటి వరకు ప్రాథమికోన్నత పాఠశాల మాత్రమే నడుస్తున్న ఆ గ్రామంలో ఆ పాఠశాలను పదోతరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయడంలో జిల్లా విద్యాధికారులతో సంప్రదించి పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేశారు. గ్రామ వాసులందరితో శ్రమదానం చేయించి పాఠశాలను నిర్మింపజేశారు.

జిల్లాలోని ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను గుర్తించి విద్య అధికారులతో చర్చించి ఆ ఉపాధ్యాయులను తన పాఠశాలకు రప్పించి తొలి సంవత్సరంలోనే ఆ పాఠశాలలో రికార్డు స్థాయి ఫలితాలు సాధించేందుకు కృషి చేశారు. అప్‌గ్రేడ్‌ చేసి పదోతరగతి ప్రారంభించిన తొలి సంవత్సరంలో చెరుకులపాడు పాఠశాల పదోతరగతిలో 512 మార్కులు సాధించి జిల్లాలోనే ఒక ఉత్తమ పాఠశాలగా పేరు గడించింది. అనంతరం ప్రతి సంవత్సరం నూటికి 100శాతం ఫలితాలను సాధిస్తూ చెరుకులపాడు పాఠశాల వెల్దుర్తి మండలంలోఉత్తమ పాఠశాలగా పలువురి మన్నలను పొందడానికి నారాయణరెడ్డే కారణం.

24 గంటల్లో అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణం:
విద్యారంగ అభివృద్ధి కోసం అంకితమై పని చేసిన నారాయణరెడ్డి చెరుకులపాడు గ్రామంలో తానే దగ్గరుండి 24 గంటల్లో అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణం చేపట్టి రాష్ట్రంలోనే ఒక సంచలనాన్ని సృష్టించారు. ఈ సంఘటననే అన్ని టీవీ చానళ్లు ప్రచారం చేశాయి. ఉన్నత పాఠశాలలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు నిర్వహిస్తూ విద్యారంగ మేధావులను ఆహ్వానిస్తూ సన్మానించిన నారాయణరెడ్డి చెరుకులపాడు గ్రామంలో విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆ గ్రామంలోని పసుపురాతి హరిత అనే విద్యార్థిని ప్రపంచ స్థాయిలో వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించడంతో అప్పటి జిల్లా కలెక్టర్‌ రాజేశ్వర్‌తివారిని, నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డిని ఆహ్వానించి ఆమెను ఘనంగా సన్మానించారు.  

కప్పట్రాళ్ల కేసులో నిర్దోషి
జిల్లాలో సంచలనం రేపిన కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో చెరుకులపాడు నారాయణరెడ్డిని నిందితునిగా చేర్చి ఇబ్బంది పెట్టాలని అధికార పార్టీ పన్నిన పన్నాగాన్ని ఆదోని న్యాయ స్థానం తిప్పికొట్టింది.  తనపై ఆపాదించబడిన కేసులో తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణరెడ్డి తీర్పు చివరి రోజున తనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంతో చిన్నపిల్లాడిలా కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్యాక్షన్‌ కోరల్లో చిక్కుకున్న వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని స్వయంగా అనుభవించానని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పగవాడికి సైతం ఇలాంటి దుస్థితి రాకూడదని బోరున విలపించారు.  

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా సందేశాలు:
ఇటీవలి కాలంలో చెరుకులపాడు నారాయణరెడ్డి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా సందేశాలను తన మిత్రులు, సన్నిహితులకు నిత్యం పంపేవారు. ప్రతి రోజు తాను పా ల్గొంటున్న కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను అప్‌ లోడ్‌ చేసే వారు. ఈ నేపథ్యంలోనే తాను మరికొన్ని గంట ల్లో హత్యకు గురవుతానని తెలియక ముందు వెల్దుర్తిలోని లిమ్రా ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరైన ఫొటోలను కూడా చివరి సారిగా తన సెల్‌ఫోన్‌ వాట్సాఫ్‌ ద్వారా పోస్టు చేశారు. వాట్సాఫ్‌లో వచ్చిన ఫోటోలను చూసి ఆయన బంధుమిత్రులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.  

30 ఏళ్ల రాజకీయ చరిత్ర
పత్తికొండ : కంగాటి లక్ష్మీ నారాయణరెడ్డి 1986లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

  1987లో చెరుకులపాడు గ్రామ సర్పంచుగా విజయం సాధించారు.

డీసీసీ ప్రధాన కార్యదర్శిగా 15 ఏళ్లు బాధ్యతలను నిర్వహించారు.

కృష్ణగిరి మండల జడ్‌పీటీసీగా బరిలో నిలిచి ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలైయ్యాడు. పదవులు అందివచ్చినా రాకపోయినా పార్టీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించారు.

1999లో వైఎస్‌ఆర్‌ అభయంతో పత్తికొండ అసెంబ్లీ నుంచి బరిలో నిలుస్తున్న సమయంలో మాజీ మంత్రి ఎస్సీ సుబ్బారెడ్డి, తనయుడు ఎస్సీ మోహన్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లోకి రావడంతో ఆనాడు నారాయణరెడ్డిని బుజ్జగించి ఎస్పీ మోహన్‌రెడ్డిని బరిలో దించారు.

2014లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలిచి ఓటమిపాలయ్యాడు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులకు డిపాజిట్లు కోల్పోతే, నారాయణరెడ్డికి మాత్రం 31 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ నాయకుల్లో రెండో స్థానంలో నిలిచారు.

ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కొద్ది రోజులకే వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు.

నియోజకవర్గంలో 168 గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక తీరును, అవినీతిని ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు.

నారాయణరెడ్డి తన నియోజకవర్గంలో దూసుకెళ్తుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా వైఎస్‌ఆర్‌సీపీలోకి రావడం మొదలెట్టారు. ఇది జీర్ణించుకోలేని రాజకీయ నాయకులు అతడిని మట్టుబెట్టాలని కుట్రలు పన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు మాటు వేసి ఆదివారం హత్య చేశారు.   

చెరుకులపాడులో విషాదఛాయలు
కర్నూలు (వైఎస్‌ఆర్‌సర్కిల్‌): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో ఆయన స్వగ్రామం చెరుకులపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్తను తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించడంతో గ్రామస్తులు, అభిమానులు, కార్యకర్తలు మృతదేహాన్ని చూసేందుకు కర్నూలు ఆసుపత్రికి తరలివెళ్లారు. దీంతో గ్రామంలోని వీధులన్నీ నిర్మాణుష్యంగా మారాయి.

దాహార్తి తీర్చిన జలదాత
గ్రామంలో నిత్యం ఏ కార్యం జరిగినా ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు నారాయణరెడ్డి ఉచితంగా మంచినీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆయన మృతి చెందడంతో గ్రామస్తులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

టీడీపీవి హత్యా రాజకీయాలే
తెలుగు దేశం పార్టీ హత్యా రాజకీయాలను పోషిస్తుంది. ప్రజల్లో ఆదరణ కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఆ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధిచెబుతారు. ప్రశాంతంగా జిల్లాలో హత్యా రాజకీయాలకు పాల్పడటం మంచి పద్ధతి కాదు. అడ్డువచ్చిన వారిని చంపుకుంటూ పోతే మళ్లీ పాత రోజులే వచ్చి పల్లెలు నాశనమవుతాయి.   
– కె.తిరుమల్‌రెడ్డి, పెట్రోల్‌ బంకు యజమాని, చనుగొండ్ల

రాజకీయంగా ఎదుర్కోవాలి
సమాజంలో హత్య రాజకీయాలు మంచివి కావు. సాధారణ పౌరుల ప్రశాంత జీవనానికి అవి భంగం కలిగిస్తాయి. గతంలో ఉన్న ఫ్యాక్షన్‌ తగ్గిపోవడంతో అంతా బాగున్నాం. తిరిగి జిల్లాను ఈ తరహా రాజకీయాలు నెలకొనడం భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కొనేవారికే భవిష్యత్‌ ఉంటుంది.
పువాడి భాస్కర్, వ్యాపారి, ఆత్మకూరు
 
రాజకీయానికి మాయని మచ్చ  
అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యంలో రెండు కళ్లు లాంటివి. అధికార పక్షం ప్రతిపక్ష నాయకులను హత్య చేయిస్తూ పోతే తిరిగి అధికారంలోకి వస్తే ఇలాంటి సంఘటనలే పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న హత్యలు ప్రజాస్వామ్యంలో రాజకీయానికి ఉన్న అర్థాన్ని మార్చి వేస్తున్నాయి. దారుణంగా హత్య చేసిన సంఘటన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేవిధంగా ఉంది.          
– సి.నారాయణ, పత్తికొండ

హత్యలు అనాగరిక చర్య
ఓ వైపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న దేశంలో ఇంకా హత్యలు చేసుకోవడం అనాగరిక చర్య. పార్టీలకతీతంగా అందరూ రాజకీయ హత్యలను ఖండించాలి. ఆధిపత్య పోరులో విభేదాలు ఏర్పడితే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇలాంటి ఘటనలో చోటు చేసుకుండా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా పెంచాలి.       
 – టి.మాధవరెడ్డి, సీనియర్‌ న్యాయవాది
 
ఫ్యాక్షన్‌ను చిచ్చు రేపుతున్నారు
టీడీపీ నేతలు ఫ్యాక్షన్‌ చిచ్చు రేపుతున్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి తన ప్రాణాలకు ముప్పుందని ఎన్నో మార్లు ప్రభుత్వానికి, పోలీసులకు బహిరంగంగా విన్నవించుకున్నా రక్షణ కల్పించలేకపోయింది. నియోజవర్గ స్థాయి నాయకుడే తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు చోద్యం చూశారు. ప్రభుత్వమే హత్యా రాజకీయాలు పోత్సహించడం దురదృష్టకరం.                  
– గుండామణి, ఆళ్లగడ్డ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement