తక్షణ సాయంగా వెయ్యికోట్లు: మోదీ
తుఫాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందని, ఈ ఆపద సమయంలో అన్ని విధాలా తాము ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విశాఖపట్నంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
''తుఫాను గమనాన్ని గుర్తించేందుకు టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నారు. ఆరోతేదీ నుంచి ఈ సంకేతాలిచ్చారు. ముందుగా అనుకున్న స్థాయి, దిశ, సమయం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఒకరకంగా ఈ ఆపద నుంచి తప్పించుకోవడంలో టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కేంద్రం, రాష్ట్రం రెండూ సమన్వయంతో పనిచేసి, సరైన దిశలో పనిచేస్తే ఎంత పెద్ద ఆపద అయినా.. దాన్నుంచి బయటపడొచ్చు. ఆంధ్రా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిమిష నిమిషానికీ అద్భుతమైన సమన్వయంతో పనిచేశాయి. స్థానిక ప్రభుత్వాలు కూడా వాటిని అమలుచేశాయి. విశాఖ ప్రజలను అభినందిస్తున్నాను. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చెప్పినట్లే చేశారు.
క్రమశిక్షణ కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడటంలో మేం విజయం సాధించగలిగాం. తుఫాను భీకరమైనది. దీన్ని మీరంతా స్వయంగా అనుభవించారు. మీరు చూపించిన ధైర్యానికి సెల్యూట్. నేను దారిలో ఇబ్బందులన్నీ గమనించాను. ఒడిషాలో కూడా చూశాను. ఈ ఆపద సమయంలో కేంద్రం మీ అందరికీ వెన్నంటి ఉంటుంది. కోస్ట్గార్డ్,నేవీ, రైల్వే, ఎయిర్లైన్స్, జాతీయ రహదారులు.. అన్నింటికీ ఎంత నష్టం వచ్చినా కేంద్రం నుంచి పూర్తి సాయం అందిస్తాం. పూర్తి సర్వే చేయిస్తున్నాం. వ్యవసాయ సర్వే, ఆస్తుల సర్వే కూడా చేయిస్తాం. ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటిల్లిందో చూస్తాం. ప్రైవేటు బీమా కంపెనీలతో మాట్లాడి, సానుభూతి దృష్టితో పరిహారం ఇప్పించాల్సిందిగా చెబుతాం. ఆంధ్రప్రదేశ్కు చాలా పెద్ద ఆపద వచ్చింది. విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా చేద్దామని ఇంతకుముందే అనుకున్నాం. అంతలోనే ఈ ఆపద వచ్చింది. అయినా.. వెనకడుగు వేసేది లేదు. విద్యుత్, మంచినీళ్లు, కమ్యూనికేషన్లను ముందుగా పునరుద్ధరిస్తాం. కొంచెం సర్వే ఇంకా చేయాల్సి ఉంది. అయినా.. ఈ ఘోర విపత్తు సమయంలో ముందుగా వెయ్యికోట్ల రూపాయల తక్షణ సాయం ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరింత సాయం చేస్తాం. మృతులు, క్షతగాత్రులకు కూడా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తాం'' అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.