సాక్షి, హైదరాబాద్/వరంగల్/గుంటూరు/తిరుపతి: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం నిర్వహించిన ‘చాయ్ పే చర్చ’ రాష్ట్రవ్యాప్తంగా 108 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగింది. బీజేపీతో సంబంధం లేకుండా సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్(కాజ్) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమం ప్రశాంతంగా జరిగిందని నిర్వాహకులు అశ్విన్, అనీష్, కిరణ్, సాయికిరణ్ తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ ఎన్‌సీసీ గేట్ వద్ద వినోద్ అనే యువకుడు చాయ్ బండి నిర్వహిస్తున్నాడు. ఇక్కడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగా.. మోడీ లైన్‌లోకి రాకపోవడం వినోద్‌తోపాటు కార్యక్రమానికి హాజరైన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, మోడీ అభిమానులు నిరాశకు గురయ్యారు. చివరిలో అందరినుద్దేశించి మాట్లాడిన మోడీ.. భవిష్యత్తులో ప్రతిఒక్కరితో మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
గుంటూరు పట్టాభిపురం స్వామి థియేటర్ దగ్గరలోని యువ టీస్టాల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో.. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రంలోని ప్రజలకు చేరట్లేదని, దళారుల చేతిలోనే కరిగిపోతున్నాయని వైవీఎస్ శశాంక్ అనే యువకుడు చెప్పాడు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఇద్దరు చాయ్ వాలాలతోనూ మోడీ మాట్లాడారు. తూర్పుకోటలో సంగ సతీష్, ఎస్‌బీహెచ్ ఎదురుగా ఉన్న దేవాంశ్ స్వీట్ హౌస్ యజమాని హుక్‌చంద్‌కు ఈ అవకాశం చిక్కింది. కాగా తిరుపతి రాములవారి గుడి వీధిలోని కోదండరామా టీ స్టాల్ యజమాని మునిరత్నంరెడ్డి.. మాట్లాడుతూ ‘‘ముస్లింలకు మీ పార్టీ వ్యతిరేకం కదా’’ అని ప్రశ్నించారు. మోడీ జవాబిస్తూ ముస్లింలకు తాము వ్యతిరేకం కాదని, గుజరాత్‌లో అన్నివర్గాలను కలుపుకుని పోతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 108 కేంద్రాల్లో ‘చర్చ’
Published Thu, Feb 13 2014 3:05 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
Advertisement