
తృటిలో తప్పిన ‘బ్లో అవుట్’ ముప్పు
కేశనపల్లి: 8 బావి నుంచి భారీగా గ్యాస్‌లీక్ ,వాల్వ్‌లు మూయని నిర్లక్ష్యమే కారణం ,సకాలంలో గ్యాస్ అదుపు చేసిన వైనం
మలికిపురం : తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్‌జీసీ వెస్ట్ స్ట్రక్టర్ పరిధిలోని తూర్పుపాలెంలో గల కేశనపల్లి : 8 బావిలో బ్లోఅవుట్ ప్రమాదం కొద్దిలో తప్పింది. బావి సమీపంలో బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో కొందరు యువకులు క్రికెట్ ఆడుకుంటుండగా భారీ శబ్దం వచ్చింది. బావి నుంచి గ్యాస్ రావడం గమనించిన యువకులు అక్కడి నుంచి పరుగు తీశారు. సుమారు 45 నిమిషాల పాటు గ్యాస్ పెద్ద ఎత్తున లీకవుతూనే ఉంది. అక్కడకు దగ్గరలోని అడవిపాలెం గ్యాస్ కలెక్షన్ స్టేషన్ ఇన్‌చార్జి అభిషేక్ ఆధ్వర్యంలో సిబ్బంది బావి వద్దకు చేరుకుని గ్యాస్‌ను అదుపు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యమే గ్యాస్ లీక్‌కు కారణమని తెలుస్తోంది.
నగరం వద్ద గెయిల్ పైపులైన్ పేలుడు నేపథ్యంలో ఇక్కడి బావుల నుంచి తాటిపాక జీసీఎస్‌కు గ్యాస్ సరఫరా నిలిచింది. దీంతో కొన్ని బావులపై ఒత్తిడి పెరిగింది. అడవిపాలెం జీసీఎస్‌కు చెందిన కేశనపల్లి : 8 బావినుంచి కూడా గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఒత్తిడి అధికమైంది. జీసీఎస్‌కు ఈ బావి నుంచి వెళ్లే పైపులైన్‌కు సరఫరా నిలిపారే తప్ప, బావి వాల్వ్‌లు మూయలేదు. దీంతో ఒత్తిడి వల్ల బావి క్యాప్‌పై ఉండే డాఫ్లన్ టేప్ పగిలిపోయింది. సిబ్బంది రావడం ఆలస్యమైనా, గ్యాస్ అదుపులో జాప్యం జరిగినా క్యాప్ పైకి లేచి పోయి బ్లో అవుట్ సంభవించేది. బావికి గల మూడు వాల్వ్‌లను కూడా సంఘటన అనంతరమే మూయడం గమనార్హం.