
సలామ్ పోలీస్
శాంతిభద్రతలను కాపాడడంలో వారికి వారే సాటి.
ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా టక్కున వాలిపోతారు.
ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ... అనుక్షణం ప్రజల రక్షణ కోసం పాటుపడే మానవతామూర్తులు.
అందరికీ కొండంత భరోసానిస్తూ ... మేమున్నామంటూ ధైర్యం చెప్పే ధీరులు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సలామ్ పోలీస్...
చిరుతలాంటి వేగం
డేగలాంటి కనులు
క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే నైజం
ఒక్క మాటలో చెప్పాంటే కనిపించని నాలుగో సింహమే పోలీస్.
ఈ రోజు అక్టోబర్ 21, అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఆరోజును పురస్కరించుకుంటూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది. 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్మరణకు నేటితో సరిగ్గా 54 ఏళ్లు.
సంఘ విద్రోహ కశక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల పోరులో ఈ ఒక్క ఏడాదే దేశంలో 579 మంది పోలీసులు అమరులయ్యారు. వీరిలో మనరాష్ట్రానికి చెందిన ఏపీఎస్పీ, ఆర్ఐ ప్రసాద్‌బాబు, గ్రేహాండ్స్‌లో డిప్యుటేషన్‌పై చత్తీస్‌ఘడ్‌లో జరిగిన మావోయిస్ట్ దాడిలో అసువులు బాసాడు. ఈనాటి మా ఆత్మార్పణం-రేపటి మీకోసం సమర్పణం అంటున్న పోలీసు అమరులకు సాక్షి హృదయపూర్వక నివాళులు అర్పిస్తోంది.
సమాజంలో ఎటు చూసినా పోటీ, అందినకాడికి దక్కించుకోవాలనే తాపత్రయం.. ఆశ, దురాశ, మంచి-చెడుల మధ్య జీవనపోరాటం... ఇన్ని కోణాల మధ్య మేమున్నామనే భరోసాయే మనకు కొండంత అండ. అంతగా మన జీవితానికి బాసటగా నిలుస్తున్న ఆ మహనీయుడే పోలీసు. నిరంతరం సమాజాన్ని కాపాడుతూ, ప్రాణాలను ఫణంగా పెట్టిన పోలీసు వీరులెందరో. ఈ వీరుల త్యాగాలకు ప్రతిఫలం దక్కాలని అందరూ కోరుకుంటున్నారు.
అయితే సమాజం కోసం వారు చేసిన సేవలను గుర్తించి. వారి కుటుంబాలను ఆదుకునేందుకు, వారి సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు అంటున్నారు. దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న భారతసైన్యంతో సమానంగా ,శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలర్పిస్తున్నారని. వారి త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సిటీ కమీషనర్ అనురాగ్ శర్మ అన్నారు.
ఉగ్రవాద, తీవ్రవాద, అరాచక శక్తుల హింసాకాండకు బలైపోతున్నారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరమే 579మంది పోలీసులు అమరవీరులయ్యారు. ప్రజల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. పోలీసుల విధి నిర్వహణ ఒక పవిత్రమైన కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణలో దేశంలో, రాష్ట్రంలో ఎందరో పోలీసులు ప్రతి ఏడాది అసువులు బాస్తున్నారు.
రాజ్యాంగ రక్షణ - ప్రజాస్వామ్య పరిరక్షణ - శాంతిస్థాపన ... ఈ మూడే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించే వారే నిజమైన పోలీసులు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా, క్లిష్టమైన సమస్యలనైనా ఎదుర్కోవడంలో ముందు నిలుస్తారు. ప్రజాశ్రేయస్సు కోసం మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో దూసుకెళతారు. ప్రజల రక్షణార్థం ప్రాణత్యాగానికైనా వెనకడుగు వేయకుండా, మొక్కవోని దీక్షతో సాగిపోతుంటారు. అందుకే పోలీసులంటే అందరికీ అంత గౌరవం, వారిపై అంతటి అపార నమ్మకం.
ఉగ్రవాద,తీవ్రవాద, అసాంఘిక శక్తులను తుదముట్టించడంలో ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన పోలీసులు ఎందరో. వారి సేవలు చిరస్మరణీయం. వారి ధైర్యసాహసాలు అద్భుతం. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాత్రనకా, పగలనకా ... పండగనక, పబ్బమనకా ... ఎనీ టైమ్ ఎనీ సెంటర్‌లో పౌరులకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు జవానుల త్యాగాలను స్మరించుకుని వారి జీవితాలే స్ఫూర్తిగా, ప్రేరణగా అందరం ప్రజాసేవకు పునరంకితం కావాలి. విధినిర్వహణలో మొక్కవోని దీక్షా తత్పరతను, వెన్నుచూపని సాహసాన్ని, అంకిత భావాన్ని చూపిన పోలీసుల సేవలను గుర్తుచేసుకుంటూ, వారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించాల్సిన తరుణమిది.
భారత పోలీసు వ్యవస్థకు 152 వసంతాలు నిండాయి. 1861లో స్వాతంత్ర్య సంగ్రామాన్ని అణచివేయడం కోసం సిపాయి తిరుగుబాటు తర్వాత ఆంగ్లేయులు పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతకుముందు సైనికులపైనే శాంతిభద్రతల బాధ్యత ఉండేది. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో పోలీసులు సమాజంలో కీలక భాగం.
సమాజసేవ చేయడమే ఊపిరిగా సాగుతోంది. పోలీసులుగా పుట్టడం, సమాజానికి సేవ చేయడం ఎంతో గర్వంగా ఉందనే పోలీసులు ఎందరో. డ్యూటీలో భాగంగా ... ప్రాణాలపైకి వస్తే, వీరమరణం పొందుతున్నామన్న ఆత్మసంతృప్తే తప్ప చనిపోతున్నామన్న బాధ వారిలో కొంచెమైనా కనిపించదు. పోలీసులు మనందరికి మార్గదర్శకులు. వీరోచిత పోరాటం చేసి, అమరులైన పోలీసులకు ఇవే సాక్షి జోహార్లు.