భిక్ష వద్దు... వాటా కావాలి
విజయవాడ: దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగ దొక్కుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జాతీయ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రజావిచారణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ... బీసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతోందన్నారు. చట్టసభల్లో బీసీల ప్రాధాన్యత కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని చెప్పారు.
50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లోనూ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి రూ.50 వేల కోట్లు కేంద్ర బడ్జెట్ నుంచి కేటాయించాలని, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీ తరగతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యకు ఈ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.