సాక్షి, అమరావతి: ఏపీ మాటే.. మా బాట! పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ప్రాంతీయ సమగ్రాభివృద్ధి సాధించవచ్చన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విధాన నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వికేంద్రీకరణ విధానం దిశగా జార్ఖండ్ కూడా అడుగులు వేస్తోంది. జార్ఖండ్‌లో ప్రస్తుతం రాజధానిగా ఉన్న రాంచీతోపాటు మరో నాలుగు ఉప రాజధానులు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సూత్రప్రాయంగా నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బహుళ రాజధానుల వ్యవస్థే సరైందని పలువురు నిపుణులు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అధికారికంగా రాజధానులుగా ప్రకటించనప్పటికీ పలు రాష్ట్రాలు పరోక్షంగా అదే విధానాన్ని అవలంబిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతకంటే సమర్థంగా బహుళ రాజధానుల విధానాన్ని పూర్తిస్థాయిలో అనుసరించడం ద్వారా ఏపీ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వత్రా ప్రశంసిస్తున్నారు.
జార్ఖండ్‌లో నాలుగు ఉప రాజధానులు..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ విధానం జార్ఖండ్ ప్రభుత్వానికి స్ఫూర్తినిచ్చింది. బహుళ రాజధానుల విధానాన్ని అమలు చేయాలని ఆ రాష్ట్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జార్ఖండ్‌కు ఇప్పటికే రాంచీ రాజధానిగా ఉండగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాలకు పరిపాలన, అభివృద్ధిలో సమాన భాగస్వామ్యం కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా మరో నాలుగు ఉప రాజధానుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించిన ఉన్నతాధికారులు సీఎం ఆమోదానికి పంపించారు. ఆ ప్రతిపాదనల ప్రకారం... భౌగోళికంగా జార్ఖండ్‌లో ఐదు ఉప ప్రాంతాలు(డివిజన్లు) ఉన్నాయి. సంతాల్ పరగణ, పాలము, కొల్హన్, ఉత్తర ఛోటా నాగపూర్, దక్షిణ ఛోటా నాగ్‌పూర్ డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుత రాజధాని రాంచీ దక్షిణ ఛోటా నాగ్‌పూర్ డివిజన్‌లో ఉంది. మిగిలిన నాలుగు డివిజన్లలో ఒక్కొక్కటి చొప్పున నాలుగు ఉప రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దుమ్కా( సంతాల్ పరగణ డివిజన్), మేదిని నగర్( పాలము డివిజన్), చైబసా(కొల్హన్ డివిజన్), గిరిడీ (ఉత్తర ఛోటా నాగ్‌పూర్ డివిజన్)లలో కొత్తగా ఉప రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆమోదముద్ర వేయగానే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
అనధికారికంగా అదే బాటలో పలు రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే శరణ్యమని పలువురు నిపుణులు ఉద్ఘాటిస్తున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ద్వారా పరిపాలన, అభివృద్ధిని అనుసంధానించి సమగ్రాభివృద్ధి సాధించవచ్చని పేర్కొంటున్నారు. పలు రాష్ట్రాలు ఇప్పటికే అనధికారికంగా బహుళ రాజధానుల వ్యవస్థను అమలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ఉదహరిస్తున్నారు. ఈ అంశంపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘వైర్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో అయినప్పటికీ ఆ రాష్ట్రం ఎన్నో ఏళ్లుగా ‘కేఏవీఏఎల్’ అనే విధానం ద్వారా ముఖ్య నగరాలు కేంద్రంగా అభివృద్ధి వికేంద్రీకరణ విధానాన్ని అనుసరిస్తోంది. ‘కేఏవీఏఎల్’ అంటే కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ఆగ్రా, లక్నో. ఆ నగరాలు కేంద్ర బిందువుగా వాటి పరిసర ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. లక్నో పరిపాలన రాజధానిగా ఉండగా అలహాబాద్‌లో హైకోర్టును ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా చేశారు. కాన్పూర్‌లో వస్తూత్పత్తి, సేవా రంగాలు ఉండగా ఆగ్రాలో పర్యాటకం– పరిశ్రమలు, వారణాసిలో ఆధ్యాత్మికం–చిన్న తరహా పరిశ్రమలు లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇక రాజస్తాన్‌లో రాజధాని జైపూర్‌తో సమానంగా ఉదయ్‌పూర్ కేంద్రంగా అభివృద్ధిని వికేంద్రీకరించారు. పంజాబ్, హర్యానాలకు చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా ఉండగా పంజాబ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని అమృత్‌సర్, లూథియానా కేంద్రంగా అభివృద్ధిని వికేంద్రీకరించి ప్రగతి సాధిస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా రాజధాని భోపాల్‌కు సమాంతరంగా ఇండోర్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఒకే ప్రాంతంలో అభివృద్ధి సరికాదు..
ఎక్కువ వేగంతో ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలంటే అధికారికంగా బహుళ రాజధానుల వ్యవస్థను ఏర్పాటు చేయడమే సరైన విధానమని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల విధానమే దీనికి సరైన సమాధానమని ప్రముఖ కాలమిస్టు, పరిపాలన రంగ నిపుణుడు సమీర్‌శర్మ ‘వైర్’ పత్రిక కథనంలో విస్పష్టంగా ప్రకటించారు. ఆయన తన వ్యాసంలో రాజధాని అంశానికి సంబంధించి ఏపీ చరిత్రను కూడా ఉటంకించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2014లో రాష్ట్ర విభజన అనుభవాల నేపథ్యంలో ఏపీలో రాజధానిని ఏదో ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. రాజధాని విధులు, వ్యవహారాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య విభజించడం ద్వారానే సమానాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
బహుళ రాజధానుల విధానమే ఏపీ అభివృద్ధికి చోదక శక్తి
సమీర్ శర్మ, ప్రముఖ కాలమిస్టు, పరిపాలనా రంగ నిపుణుడు
‘వికేంద్రీకరణ విధానమే ఏపీ సమగ్రాభివృద్ధికి చోదకశక్తిగా ఉపకరిస్తుంది. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించవచ్చు. సరైన రీతిలో సహజ వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ, విద్య–వైద్య రంగాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఆహార భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ తదితర కోణాల్లో రాష్ట్రానికి బహుళ రాజధానుల వ్యవస్థ ఉత్తమమైనది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారానే ఆర్థికాభివృద్ధి, ప్రాంతీయ సమానాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనే మూడు కీలక లక్ష్యాలను సాధించవచ్చు’
సీఎం సాహసోపేత నిర్ణయంతో రాష్ట్ర పురోభివృద్ధి
– ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ (మాజీ వీసీ, డా.బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం)
‘పరిపాలన, అభివృద్ధిని వెనుకబడిన ప్రాంతాలకు వికేంద్రీకరించడం ద్వారానే పురోభివృద్ధి సాధ్యమని పంచవర్ష ప్రణాళికల లక్ష్యాల్లో పేర్కొన్నారు. గత ఏడు దశాబ్దాల్లో ఈ విషయాన్ని రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదు. హరిత విప్లవం ద్వారా సాగునీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలే అభివృద్ధి చెందాయి. ఇతర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పటికైనా రాష్ట్రంలో సహజవనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి. ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్ ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం. ఈ తరహా వికేంద్రీకరణ విధానాల వల్ల అన్ని ప్రాంతాల్లో వనరులు గరిష్టంగా వినియోగమై రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వృద్ధి రేటు పెరుగుతాయి. తలసరి ఆదాయం పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి’
Comments
Please login to add a commentAdd a comment