నవోదయంలో.. 9వ తరగతికి ఎంట్రీ ఇలా.. | Navodayam Entrance Tips | Sakshi
Sakshi News home page

నవోదయంలో.. 9వ తరగతికి ఎంట్రీ ఇలా..

Published Thu, Mar 15 2018 11:39 AM | Last Updated on Thu, Mar 15 2018 11:39 AM

Navodayam Entrance Tips - Sakshi

నిడమర్రు : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాలు ముందుంటాయి. పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు ముందువరసలో ఉన్నాయి. వీటిలో ప్రవేశం లభిస్తే విద్యార్థులు నిశ్చింతగా చదువుకోవడమే కాకుండా వారిలోని ప్రతిభ, సృజనాత్మకతకు మరింత మెరుగులద్దవచ్చు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధిస్తారు. వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం తదితర సదుపాయాలన్నీ ఉచితంగా అందిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9వ తరగతిలో ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి నవోదయ విద్యాసమితి  2018–19 విద్యా సంవత్సరానికి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జిల్లాలో ఉన్న పెదవేగి నవోదయ  విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీగా ఉన్న 8 సీట్లు భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

దేశంలో 626 విద్యాలయాలు
జాతీయ విద్యా విధానం–1986 ప్రకారం దేశవ్యాప్తంగా (తమిళనాడు మినహా) జవహర్‌ నవోదయ విద్యాలయాలు ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 626 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. విద్యతోపాటు విలువలు, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడమే వీటి లక్ష్యం. విద్యార్థి సర్వోతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల అంశాలకు ఈ విద్యాలయాలు వేదికలుగా ఉన్నాయి. ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్య అందిస్తారు. నిధులన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యా సమితి పనిచేస్తుంది.

లేటరల్‌ ఎంట్రీ విధానంలో భర్తీ
నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చు. సీటు లభించిన ప్రభుత్వోద్యోగుల పిల్లలైతే ప్రతి నెల రూ.1,500 చొప్పున చెల్లించాలి. మిగిలిన వారు ప్రతి నెల రూ. 600 చెల్లిస్తే సరిపోతుంది.

ప్రత్యేకతలు
బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్‌ వసతి
ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, యోగా  శిక్షణ
♦ 1ః8 నిష్పత్తిలో కంప్యూటర్‌ ల్యాబ్‌
ఇంటర్‌(ప్లస్‌ 2) వరకూ చదువుకోవచ్చు.
నీట్‌–2017 పరీక్షల్లో 11,875 మంది నవోదయ విద్యార్థులు అర్హత సాధించారు.
జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ 2017లో 1,176 మంది నవోదయ విద్యార్థులు అర్హత సాధించారు.

ప్రవేశం ఇలా.. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఎంపికైన విద్యార్థులకు పోస్ట్‌ ద్వారా సమాచారం అందిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీషు/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. ఓఎంఆర్‌ షీట్‌లో 100 మార్కులకు సమాధానాలను గుర్తించడానికి రెండున్నర గంటలు (150 నిమిషాలు)సమయం కేటాయిస్తారు. ఇందులో ఇంగ్లీషు–15, హిందీ–15, గణితం–35, సైన్స్‌–35 మార్కులకు ప్రశ్నలుంటాయి.
అర్హత ఇలా
2017–18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి చదవాలి.
విద్యార్థి వయసు 2002 మే 1 నుంచి 2006 ఏప్రిల్‌ 30 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఇలా
వెబ్‌సైట్‌లో ఏప్రిల్‌ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మే 19న రాత పరీక్ష పెదవేగి నవోదయ విద్యా కేంద్రం/కేటాయించిన పరీక్షా కేంద్రంలో  ఉంటుంది. మరిన్ని వివరాలకు నవోదయ విద్యాలయాల వెబ్‌సైట్‌ సందర్శించండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement